జగిత్యాల, మే 28 (నమస్తే తెలంగాణ) : టీడీపీ నాయకుడు బకని నర్సింహులు నిజంగా తెలంగాణ బిడ్డ అయితే.. తెలంగాణ పదం డిక్షనరీలో లేదనడం మూర్ఖత్వమని, చంద్రబాబు మాటను నర్సింహులు పలికారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రం ఏర్పడి పన్నెండేండ్లు గడుస్తున్నా టీడీపీ ఇంకా రాష్ట్రంపై, ఇక్కడి ప్రజలపై, నాయకులపై అక్కసును వెల్లగక్కు తూనే ఉన్నదని మండిపడ్డారు. మూడున్నర కోట్లమంది ఉద్యమించి.. కేసీఆర్ ప్రాణత్యాగానికి సిద్ధపడితే తెలంగాణ రాష్ట్రం ఉద్భవిందని స్పష్టంచేశారు. తెలంగాణ ఔన్నత్యం, ఉనికిపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నిర్వహించిన మహానాడులో తెలంగాణ ప్రాంత నాయకుడు బక్కని నర్సిం హులు తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదని వ్యాఖ్యానించడం టీడీపీ అహంకారపూరిత చర్యలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దకాలం గడుస్తున్నా, టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ఏర్పాటును జీర్ణించు కోలేక పోతున్నారని దుయ్యబట్టారు.
ఈ వ్యాఖ్యలను చంద్రబాబు తక్షణమే ఖండించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అనాదిగా పోరాటలకు పురిటిగడ్డ అని స్పష్టంచేశారు. బౌద్ధ, జైన, శాతవాహన, పొలవాస, చాళుక్య, కాకతీయులు, కుతుబ్ షాహీలు.. అజాంజాహీలు పరిపాలించిన నేల అని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమాల గడ్డగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విషయం అందరికీ తెలుసు అని అన్నారు. నైజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి వేదికగా నిలిచిన వీరులగడ్డ అని గుర్తుచేశారు. సమానత్వం, సామ్యవాదం కోసం పోరాడిన నక్సల్బరి ఉద్యమానికి ప్రతీక తెలంగాణ అని తెలిపారు. తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ తన స్పీకర్ తన పదవిని త్యాగం చేసి, ఉద్యమ పార్టీ నెలకొల్పి, దేశంలోని అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేశారని వివరించారు.