ఖలీల్‌వాడి, మే 3: రోడ్లపై ఎక్కడ చూసినా వడ్లే కనిపిస్తున్నాయని.. ప్రభుత్వం అసలు ధాన్యం కొంటుందా.. కొనదా సూటిగా చెప్పాలని మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్మడానికి రైతులు నెల రోజులుగా ఎదురుచూస్తున్నా ఈ ఇందిరమ్మ రాజ్యానికి ఇసుమంత కనికరం లేదని శనివారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. రోడ్లపై, కల్లాల్లో ఉన్న ధాన్యం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు.
రేవంత్ సర్కార్ నిర్లక్ష్యానికి అన్నదాతల శ్రమ ఆవిరవుతున్నదని, ధాన్యం కొనే దిక్కులేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అటు ఐకేపీలు, ఇటు సొసైటీలు ఎవరికివారుగా కేంద్రాలు తెరిచి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు చెబుతున్నప్పటికీ ధాన్యం రాశులు మాత్రం రోడ్లు, కల్లాల నుంచి కదలడం లేదని పేర్కొన్నారు. వడ్లు కొనేందుకు కొర్రీలు పెడుతూ రైతులను అవమానిస్తున్నారని, ధాన్యం అమ్ముడుపోక అన్నదాతలు అవస్థలు పడుతున్నా యంత్రాంగం పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. చివరి గింజ వరకు కొంటామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అరిగిపోయిన రికార్డును పదేపదే వినిపిస్తున్నా క్షేత్రస్థాయిలో ఎక్కడా కొంటున్న దాఖలాలు లేవని విమర్శించారు.