ఖలీల్‌వాడి, ఆగస్టు 2: తాను గాంధేయవాదినని చెప్పుకునే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ చేతల్లో మాత్రం గాడ్సేయిజం ప్రదర్శిస్తున్నారని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆలూర్ నుంచి ఆర్మూర్ వరకు పాదయా త్ర సందర్భంగా ఎక్కడ నిరసన సెగలు తగులుతాయోనన్న భయంతో బీఆర్ఎస్, రైతు నాయకులను అరెస్టు చేయించటం అక్రమమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్మూర్‌లోని తన ఇంటి చుట్టూ, నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ ఆఫీస్ చుట్టూ పోలీసులను మోహరించటం దారుణమ ని ధ్వజమెత్తారు. ‘మీనాక్షి రాహుల్‌గాంధీ దూత.. తెలంగాణ ప్రజలపై అణచివేత’ అని అభివర్ణించారు.
అక్రమ కేసులు, అరెస్టులు, అణచివేతలు, కూల్చివేతలు కాల్చివేతలే గానీ.. ఇందిరమ్మ హింసాత్మక రాజ్యంలో ప్రజాస్వామ్యంలేదని ధ్వజమెత్తారు. ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకోవడానికి గులాబీ శ్రేణులను అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్మూర్‌లో అన్నదాతలపై నిర్బంధకాండ అమలు చేయడం కాంగ్రెస్ దుర్నీతికి నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్ అరాచక పాలనపై ప్రజలు తిరగబడాలని జీవన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
రేవంత్‌రెడ్డి నిర్బంధ పాలనలో ప్రశ్నిస్తే నేరమైందని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. అడుగు తీసి అడుగేస్తే కేసు, నోరు తెరిస్తే కేసు, నిరసన తెలిపితే కేసు, ప్రజల తరపున నిలబడితే కేసు, పాలనా వైఫల్యాలు ఎండగడితే కేసు, పరామర్శకు పోయినా కేసు, ప్రజాసమస్యలు ప్రస్తావిస్తే కేసు, సీఎంను విమర్శిస్తే కేసు, సీఎం పేరు మర్చిపోయినా కేసు, అక్రమ కేసులపై ఆందోళన చేసినా అక్రమ కేసు పెట్టి జైళ్లపాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.