జగిత్యాల, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ) : అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించి.. పదేండ్లపాటు కష్టపడిన అసలు సిసలు కాంగ్రెస్ కార్యకర్తలను గోసపెడుతున్న వారిని తరిమికొట్టాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి పిలుపునిచ్చారు. పదేండ్లపాటు అధికారంతో విర్రవీగి, అభివృద్ధి పేరిట కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే తీరుతోపాటు, కాంగ్రెస్ పార్టీ విధానాలపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు నవ్వుల పాల్జేస్తున్నదని అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన పొలాస దేవస్థానం కార్యవర్గం నియామకంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వారిని నియమించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీరు, ఎమ్మెల్యే వ్యవహార శైలితో ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు చులకన చూస్తున్నారని తెలిపారు. పదేండ్లపాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అధికార పక్షంపై పోరాటం చేస్తేనే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ప్రతి కార్యకర్త శ్రమ ఉన్నదని, అలాంటి వారి శ్రమను వ్యర్థం చేస్తూ, పదేండ్లపాటు అధికారంతో విర్రవీగి, ఇప్పుడు అభివృద్ధి పేరిట కాంగ్రెస్‌లోకి ప్రవేశించడం సరికాదని అన్నారు.
2008లో తెలంగాణను అభివృద్ధిని చేయాలని తాను పేర్కొన్నానని, ఆ సమయంలో ఉద్యమ నేతగా, ఎంపీగా ఉన్న కేసీఆర్, అభివృద్ధి పౌర హక్కు, తెలంగాణ తన జన్మహక్కు అని ప్రకటించారని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రకటన అక్షర సత్యమని కొనియాడారు. ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన అభివృద్ధి జరగదు, చేయరాదు అనేది తప్పు మాట అని తెలిపారు. 2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం హోదాలో కేసీఆర్ కరీంనగర్లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తే, ఆ సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న తన ప్రసంగంతోనే సమావేశాన్ని కేసీఆర్ ప్రారంభించారని గుర్తుచేశారు. జగిత్యాల అభివృద్ధి నేపథ్యంలో బోర్నపెల్లి-చిన్నబెల్లాల వంతెన మంజూరు చేయాలని కోరానని, వెంటనే స్పందించిన కేసీఆర్ కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో రూ.70 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే, ప్రతిపక్షంలో ఉన్నా అభివృద్ధి చేయవచ్చని సూచించారు. జగిత్యాలలో అభివృద్ధి పేరిట అధికార పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే, ఆయన అనుచరుల వ్యవహారశైలి సరిగా లేదని మండిపడ్డారు.