జగిత్యాల, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆంధ్రా సీఎం చంద్రబాబు కొత్త స్కెచ్ వేశాడని, ఆ ప్రకారమే రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. చంద్రబాబు పార్టీకి తెలంగాణలో అవకాశాలు లేవని, అందుకే రేవంత్‌ను కాంగ్రెస్‌లో చేరాలంటూ నక్షా ఇచ్చాడని తెలిపారు. ఆ ప్రకారమే రేవంత్‌రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్‌లో చేరి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడని చెప్పారు. ఒక పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మరో పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలా అవుతారని, ఇది నైతికమేనా? అని ప్రశ్నించారు.
‘రేవంత్‌రెడ్డీ.. నేడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావంటే అది కేసీఆర్ పుణ్యమే అన్న విషయం గుర్తుపెట్టుకో’ అని హితవుపలికారు. ‘కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడి రాష్ట్రం తేకపోతే నువ్వు సీఎం అయ్యేవాడివా?’ అని ప్రశ్నించారు. అధికార పార్టీతో కలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్తున్న జగిత్యాల ఎమ్మెల్యే, సీఎం రేవంత్‌రెడ్డి ఇద్దరూ తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ వెంట వెళ్లాలని ఎద్దేవాచేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
సీఎం రేవంత్‌రెడ్డి మేడిగడ్డ పరిశీలన సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉరితీయాలని, ఆయనకు ప్రాణహాని జరగాలంటూ చేసిన వ్యాఖ్యలపై జీవన్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి రాష్ర్టానికి పట్టిన శని, పీడ, ఆ పీడ పోవాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు’ అని స్పష్టంచేశారు. రేవంత్‌రెడ్డి ఒక ఏడాది మంత్రి పదవి లేకపోవడం వల్లే పార్టీ మారానని విమర్శించడం అర్థరహితమని చెప్పారు. పార్టీలు మార్చే వ్యవస్థ, వ్యవహారం అంతా రేవంత్‌రెడ్డిదేనని, ఆయనవి మొదటి నుంచీ కుట్రపూరిత రాజకీయ వ్యవహారాలేనని విమర్శించారు.
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు తరఫున తన ఆంతరంగికుడైన వేం నరేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీ చేయడానికి కుట్ర చేశాడని, టీడీపీ తరఫున ఎంపికై ఆపైన చంద్రబాబు స్కెచ్ ప్రకారం నడుచుకుంటూ వస్తున్నాడని, టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూనే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన అవకాశవాది రేవంత్‌రెడ్డి అని మండిపడ్డారు. రాహుల్‌గాంధీని పీఎం కాకుండా అడ్డుకున్నదే రేవంత్‌రెడ్డి అని చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, చేవెళ్ల లాంటి చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి కారణం కూడా రేవంత్‌రెడ్డేనని తెలిపారు. ఏపీ ప్రయోజనాల కోసం తెలంగాణ జలవనరులను రేవంత్‌రెడ్డి నాశనం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. మేడిగడ్డ బరాజ్‌ను బాగుచేయకపోవడం వెనుక గోదావరి జలాలను ఏపీకి తరలించే పెద్ద కుట్ర దాగి ఉన్నదని వెల్లడించారు.
‘జగిత్యాల సభలో వాస్తవాలు మాట్లాడితే కేసీఆర్‌ను ఉరి తీయాలని అంటావా? మేడిగడ్డలో ఒక్క పిల్లర్ కుంగిపోయి 30 నెలలైంది. ఇన్నాళ్లుగా ఏం చేస్తున్నవ్?’ అని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడే సీఎం నిద్ర లేచినట్టు నటిస్తున్నాడని ఎద్దేవాచేశారు. మేడిగడ్డ మరమ్మతులు చేస్తే కేవలం రూ.400 కోట్లు అవుతాయని ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ పనులు చేపట్టలేదని, కేవలం కేసీఆర్‌ను దోషిగా చూపడం కోసం మేడిగడ్డ మరమ్మతులను జాప్యం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జలకల్పవృక్షమని తేల్చిచెప్పారు.
‘నలభై ఐదేండ్ల నా ప్రజాజీవితం తెరచిన పుస్తకం. నాదెండ్ల భాసర్రావును మంత్రి పదవి నుంచి తొలగించడం సరికాదని, ఆయనకు మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేసి సపోర్ట్ చేసిన. కాంగ్రెస్ అధినేత్రి, నాటి ప్రధాని ఇందిరాగాంధీ సైతం నాదెండ్లకు అండగా నిలిచారు. ఈ విషయం రేవంత్‌రెడ్డికి తెలుసా?’ అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. అనంతరం నాదెండ్ల కాంగ్రెస్ తరఫున ఖమ్మం ఎంపీగా పనిచేశారని, ఆయన కూడా కాంగ్రెస్ నాయకుడేనని తెలిపారు. 1984 నవంబర్‌లో ఎన్టీఆర్ శాసనసభను రద్దు చేశాడని, ఎమ్మెల్యే పదవి ముగిసిన తర్వాతే తాను కాంగ్రెస్‌లో చేరానన్న విషయం రేవంత్‌రెడ్డి తెలుసుకోవాలని సూచించారు. 1984 నాటికి పార్టీ ఫిరాయింపు చట్టమే లేదని, ఎల్లవేళలా రాజ్యాంగాన్ని అనుసరించానే తప్ప ఉల్లంఘించలేదని స్పష్టంచేశారు. 2014లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకడినే గెలిచానని, 2019లో శాసన మండలిలో ఒంటరిగా పోరాటం చేశానని, పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించే పరిస్థితి లేదని, అయినా పార్టీ మారలేదని, తాను ఏనాడూ పదవులు ఆశించలేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
మేడిగడ్డను రేవంత్‌రెడ్డి పునరుద్ధరిస్తాడన్న నమ్మకం లేదని, అది కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని జీవన్‌రెడ్డి స్పష్టంచేశారు. చెరువులు ఆక్రమిస్తే తొలగించాలే తప్ప, పేదల ఇండ్లు కూల్చడం ఏమిటని మండిపడ్డారు. ప్రజాపాలన పేరుతో ప్రజలను వంచిస్తున్నారని విమర్శించారు. ‘ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించి, వారికి సమానంగా వేతనాలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. మరి నువ్వు ఎందుకు ఆ పనిచేయలేకపోయినవ్? ఇప్పు డు ఆర్టీసీ కార్మికులు ఎందుకు సమ్మెకు పోతున్నరు?’ అని ప్రశ్నించారు. ‘14 సార్లు జీవన్‌రెడ్డికి బీఫామ్ ఇచ్చామంటున్నరు. సామర్థ్యం లేకుంటేనే ఇచ్చారా? నాకు అవకాశం వచ్చిన ప్రతిసారీ మంచి ఫలితాలు నమోదు చేసిన’ అని గుర్తుచేశారు. రేవంత్ సీఎం అయ్యాక కొడంగల్‌లో బీజేపీకి 60 వేల ఓట్లు పెరిగాయని, ఇది దేనికి నిదర్శమని నిలదీశారు.
తెలంగాణకు కేసీఆర్ మాత్రమే శ్రీరామ రక్ష అని, అందుకే ‘కేసీఆర్ రావాలి.. రేవంత్ పోవాలి’ అని ప్రజలు కోరుకుంటున్నారని జీవన్‌రెడ్డి స్పష్టంచేశారు. ‘రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో ఎప్పుడేమైతదో తెల్వది. ఈ రెండున్నరేండ్లు కొసెల్లుతదో లేదో తెల్వది’ అని దెప్పిపొడిచారు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్వీర్యమైందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి వల్ల 20 నెలలుగా మానసిక క్షోభ అనుభవించానని, కేసీఆర్ పెద్ద మనసుతో తనను అక్కున చేర్చుకున్నారని, తన ప్రజా జీవితానికి నూతనాధ్యాయం ఆరంభమైందని చెప్పారు. రేవంత్‌రెడ్డి ప్రకటించిన బీసీ జనాభా లెక్కల్లో ముస్లిం మైనారిటీల జనాభా కలుపుకొని బీసీలు 56 శాతమని చెప్పారని, ఐదుశాతం బీసీ జనాభా ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చారని, ఆ కంపెనీలో కొనసాగడం ఇష్టం లేక బయటకు వచ్చానని స్పష్టంచేశారు. రేవంత్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ రోజూ రాజ్యాంగాన్ని చదువుకోవాలని, అందులోని పదో షెడ్యూల్‌ను అధ్యయనం చేయాలని చురకలంటించారు. కొప్పుల, కల్వకుంట్ల, దావ వసంత మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి అసభ్యకరమైన భాషను తప్పు పట్టారు. కేసీఆర్ లాంటి ఉద్యమనేత చావును కోరడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మార్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్‌రావు, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
జగిత్యాలలో సోమవారం నిర్వహించిన కేసీఆర్ బహిరంగ సభ తెలంగాణ ఉద్యమాన్ని తలపించిందని జీవన్‌రెడ్డి చెప్పారు. రెండుసార్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి దేశంలో తెలంగాణను మొదటి స్థానంలో నిలిపిన గొప్ప పాలకుడిగా నిలిచారని కొనియాడారు. కేసీఆర్ రైతులను ఆదుకుంటే రేవంత్‌రెడ్డి వారిని అరిగోస పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల సమయంలో అన్నివర్గాలకు ఎన్నో హామీలు ఇచ్చిన రేవంత్‌రెడ్డి అవన్నీ ఎగ్గొట్టాడని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో గర్భిణులు, పుట్టిన పిల్లల కోసం కేసీఆర్ కిట్ ఇచ్చారని, ఆ పేరు నచ్చకపోతే ఇందిరమ్మ పేరుతో అమలు చేయాల్సి ఉండెనని కానీ, ఆ పథకాన్ని కూడా బంద్ పెట్టారని మండిపడ్డారు. అందుకే ‘రేవంత్‌రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి’ అని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. సోమవారం జరిగిన సభలో ఎవరూ రేవంత్ రెడ్డి కీడును వ్యక్తిగతంగా కోరలేదని, ప్రజలు పాలనలో మార్పు కోరుతున్నారన్న విషయాన్నే ప్రస్తావించామని తెలిపారు. ‘మేం హుందాగా మాట్లాడితే సీఎం రేవంత్‌రెడ్డి అందుకు భిన్నంగా వ్యక్తిగతంగా అసభ్యకరమైన భాషను ప్రయోగించడం సరికాదు’ అని పేర్కొన్నారు.