Jeevan Reddy | క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఇన్నేళ్లు కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని తెలిపారు. కానీ 20 మాసాలు నా ఉసురుపోసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతకాలం ఈ మానసిక క్షోభ భరించాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ బలోపేతానికి నాలుగు దశబ్దాలు పోరాడితే చివరకు దక్కింది ఏంటి.. నా జీవితం చివరి దశలో ఈ మానసిక్ష క్షోభ ఏంటని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సమయంలో కేసీఆర్ నాకు చెయ్యిందించి అండగా ఉన్నారని తెలిపారు.
జగిత్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. నా ప్రజా జీవితంలో ఇది ఒక మలుపుగా భావిస్తున్నానని రెడ్డి తెలిపారు. మీ అందరి అండదండలతో ఈ స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చూపెట్టిన వివక్షతో బీఆర్ఎస్ పార్టీలో చేరానని స్పష్టం చేశారు. నేనేదో ఆశించి పార్టీ మారలేదని స్పష్టం చేశారు. నాలుగు దశాబ్దాల్లో ఎన్నో పదవులు చూశానని అన్నారు. రాష్ట్రానికి పట్టిన శని వీడాలని ఉద్దేశంతోనే పార్టీలో చేరానని చెప్పారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ సందర్భంలోనే కేసీఆర్ తనను పార్టీలోకి ఆహ్వానించారని జీవన్ రెడ్డి తెలిపారు. కానీ క్రమశిక్ష కలిగిన వ్యక్తిగా కాంగ్రెస్‌లోనే కొనసాగానని పేర్కొన్నారు. ఉద్యమ రథసారథిగా కేసీఆర్ తెలంగాణ సాధించారని అన్నారు. అలాంటి వ్యక్తితో పనిచేసే అవకాశం తనకు వచ్చిందని తెలిపారు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని జీవన్ రెడ్డి విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా కేసీఆర్ రైతుబంధు ప్రవేశపెట్టారని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ఎగ్గొట్టిందని అన్నారు. కేసీఆర్ కల్యాణలక్ష్మీ పేరుతో రూ. లక్ష ఆర్థిక సాయం చేశారని తెలిపారు. అయితే కాంగ్రెస్ రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్నారని గుర్తుచేశారు. కానీ ఉన్న పథకాన్నే ఊడగొట్టే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదని విమర్శించారు.
కేసీఆర్‌తో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు. బోర్నపల్లి నిర్మాణానికి రూ.70 కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాను చేసిన ఘనత కేసీఆర్‌ది అని కొనియాడారు. కేసీఆర్ జగిత్యాలకు మెడికల్ కాలేజీ ఇచ్చారని తెలిపారు. వైద్య సేవలను విస్తరించారని పేర్కొన్నారు. గురుకుల ఆశ్రమ పాఠశాలలను ఏర్పాటు చేశారని చెప్పారు. గిరిజనులకు రిజర్వేషన్లను కూడా పెంచారని అన్నారు.