ఖలీల్‌వాడి, జూన్ 23: నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్.. ఒక కుసంస్కారి అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి అర్వింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అవినీతి బురదగుంట ఫ్యామిలీలో పుట్టిన అర్వింద్.. కేసీఆర్ ఫ్యామిలీని తిట్టి పెద్ద నాయకుడివై పోవాలనుకుంటు న్నావా? అని ప్రశ్నించారు.
తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్‌ను జైల్లో పెడతారా? తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపినందుకు విమర్శిస్తారా అని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, కవిత కాలిగోటికి కూడా అరవింద్ సరిపోడన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీనే రప్పరప్ప అని తరిమికొడతారని ధ్వజమెత్తారు. గుజరాత్ గులామ్‌లా మాట్లాడకుండా తెలంగాణ సోయి తెచ్చుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ తెలంగాణ సూర్యుడని, ఆయనతో పెట్టుకుంటే మసికాక తప్పదని హెచ్చరించారు.