తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ హైకమాండ్ చేసిన అన్యాయంపై హరీశ్‌రావు మాట్లాడితే తప్పేమిటని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. పీవీ కాంగ్రెస్‌వాదే అయినప్పటికీ ఆయన్ను కాంగ్రెస్‌వాదిగా ఆ పార్టీ హైకమాండ్ గుర్తించలేదని పేర్కొన్నారు. పీవీ అంత్యక్రియలు అత్యంత అవమానకర పద్ధతుల్లో జరపడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఆదివారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. పీవీ వ్యవహారంలో జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ కించపరిచిందని చెప్పే సందర్భంలో పీవీని అవమానించిన తీరును హరీశ్‌రావు వివరించారని పేర్కొన్నారు. దివంగత కాంగ్రెస్ ప్రధానులకు ఢిల్లీలో స్మారక స్థలాలు ఉన్నప్పటికీ పీవీకి అక్కడ ఎందుకు నెలకొల్పలేదని ప్రశ్నించారు. పీవీ శతజయంతి వేడుకలు నిర్వహించాలని ఏ కాంగ్రెస్ నాయకుడూ అడగకపోయినప్పటికీ కేసీఆర్ తెలంగాణలో అత్యంత ఘనంగా నిర్వహించారని గుర్తుచేశారు.