సారంగాపూర్, మే 19 : రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తున్నదని, క్వింటాల్‌కు పది కిలోల కోతపెడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రాల్లో ధాన్యం తూకం వేసినప్పుడు తేమ శాతం 17 వస్తే అన్లోడ్కు వచ్చేనాటికి 8నుంచి 9 శాతానికి పడిపోతూ బస్తాలు వెయిట్ లాస్ వస్తున్నాయని, ఇప్పటికే తూకంలో క్వింటాల్‌కు 5 కిలోలు కట్ చేస్తుంటే, తరలింపులో జాప్యంతో మరో 5 కిలోలు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి సీఎం అయినందుకు రాష్ర్టానికి ఆర్ఆర్ ట్యాక్స్ కింద క్వింటాల్‌కు పదికిలోలు కట్ చేస్తున్నారని విమర్శించారు. ఈ రకంగా ఎకరానికి 30 క్వింటాళ్ల పంటకు రూ.7,500 రైతులు మునుగుతున్నారని తెలిపారు. మంగళవారం జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లిలోని లచ్చనాయక్‌తండా, రేచపల్లి, భీంరెడ్డి గూడెం, మ్యాడారం తండాలోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రైతులు కల్లాల్లో పడిగాపులు కాస్తుంటే రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యాటక వారోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డికి టూర్ల మీద ఉన్న శ్రద్ధ రైతుల సమస్యలపై లేదని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయ మంత్రి ఉన్నారా.. లేరా? తెలియడం లేదని అన్నారు. ఆయన ఎక్కడా సెంటర్లను పరిశీలించిన దాఖలాలు కన్పించడం లేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా జిల్లా ఇన్చార్జి మంత్రులు వచ్చే వారం, పది రోజులు పాత పది జిల్లాల పరిధిలో పర్యటించి అక్కడే ఉండి క్యాంపులు వేసి ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఉత్తమ్ కుమార్‌రెడ్డి నల్లగొండ జిల్లాకు ఫ్లయింగ్ విజిట్‌కు వెళ్లారని, ఎవరైనా రోడ్డు మార్గం ద్వారా పోతే నాలుగు కేంద్రాలు కన్పిస్తాయని, ఆకాశంలో తిరిగి చూస్తే ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుడు లేని లారీల కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందని నిలదీశారు. ప్రభుత్వానికి నిర్దిష్టమైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో వ్యవసాయం కనుమరుగైపోతుందని హెచ్చరించారు. ఎరువుల విక్రయాలను వచ్చే నెల 1వ తేదీ వరకు నిషేధించడంతో కూరగాయలు, మక్కలు సాగుచేసే రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని అన్నారు.