ప్రజాస్వామ్యంలో బతుకుతూ తమ ఓటుతో తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే బాధ్యత, హక్కు కలిగిన ప్రతీవారు తమ పూర్వ చరిత్ర గురించి తెలుసుకోవాలి. అన్ని శాస్ర్తాలూ విజ్ఞానాన్ని పంచితే, చరిత్ర విజ్ఞానంతోపాటు గుణపాఠాలను కూడా నేర్పుతుంది. ఆ పాఠాలు నేర్వకుండా, అప్రమత్తత వహించని ప్రజలకు జీవితం అతలాకుతలం అవుతుంది. ప్రపంచంలో ఉన్న 256 దేశాల్లో 10 దేశాలు మాత్రమే ఆనందకర సూచిక (హ్యాపీ ఇండెక్స్)లో వందశాతం గుర్తింపు పొంది, అక్కడి ప్రజలు ఏ లోటూ లేకుండా జీవిస్తున్నారంటే, ఆధునిక మానవులందరూ నాగరీకులేనా అని అనుమానించవలసి వస్తుంది. మన రాష్ట్రం నుంచి దేశం వరకు ఉన్న పరిస్థితులు విశ్లేషించి వాటి కారణాలు అర్థం చేసుకుందాం.
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో గమనిస్తే కొన్ని చారిత్రక సంఘటనలు ప్రజల జీవితాలను కొత్త మలుపులు తిప్పినవి కనిపిస్తాయి. చిత్రంగా అటువంటివి పూర్వంలో జరిగినవే మరి! మహాభారత కథలో ధృతరాష్ర్టుడు పాండురాజు కంటే పెద్దవాడు. కానీ అతను గుడ్డివాడు కావడంతో తమ్ముడైన పాండురాజుకు పట్టాభిషేకం చేయాలని అనుకుంటాడు భీష్ముడు. కానీ అన్నగారి మీద అమితమైన అభిమానం గల పాండురాజు, ధృతరాష్ర్టుడినే మహారాజుగా చేయించి, తను మిగతా విషయాలు చూసుకుంటాడు. అయితే, అతని మరణం తర్వాత, అతని కొడుకులకు కొంత రాజ్యం ఇచ్చి, వారిలో పెద్దవాడైన ధర్మరాజును రాజుగా నియమిస్తాడు ధృతరాష్ర్టుడు. పాండవుల పట్ల అత్యంత అసూయ కలిగిన దుర్యోధనుడికి వారంతా వీరులని తెలుసు. కానీ ధర్మరాజు 23 ఏండ్ల అద్భుతపాలన, వారు సంపాదించిన ప్రజాదరణ, ఖాండవ వనాన్ని అతి సుందరంగా మలచి, అందులో వారు నిర్మించిన మయసభ, ధర్మరాజు విజయవంతంగా రాజసూయ యాగం చేసి, పలు చిన్న రాజ్యాలను సామంత రాజ్యాలుగా మలుచుకోవటం-ఇవన్నీ చూసిన దుర్యోధనుడు ఓర్వలేకపోతాడు. ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ అద్భుత పాలనలో తెలంగాణ అభివృద్ధి చెంది, దేశంలోనే నంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకోవడం చూసిన ఆంధ్రపాలకులలాగ దుర్యోధనుడు కోపం, కక్ష, ద్వేషంతో రగిలిపోతాడు. కానీ ప్రజలకు అంత అభివృద్ధి, అతి తక్కువ సమయంలో చూపించిన ఉద్యమపార్టీ బీఆర్ఎస్ 2023 ఎన్నికల్లో ఓడిపోవడం ఏమిటి? ఇక్కడ కూడా మహాభారత చరిత్రలో చోటుచేసుకున్న ఒక మెలిక జరిగింది.
అంతకుపూర్వమే అప్పటి గాంధారదేశం (నేటి ఆఫ్గనిస్థాన్) రాజైన సుబల కూతురు గాంధారిని ధృతరాష్ర్టుడికి ఇచ్చి వివాహం చేయాలని భీష్ము డు అడుగగానే సుబల వ్యతిరేకించలేకపోయాడు. ఎందుకంటే గాంధార రాజ్యం చిన్న రాజ్యం. కురురాజ్యం చాలా బలమైన విశాల రాజ్యం. గాంధారి కూడా వివాహానికి ఒప్పుకున్నది. కానీ ఆమె చిన్న తమ్ముడైన శకునికి తన సోదరిని ఒక అంధుడికి ఇచ్చి పెండ్లి చేయడం ఇష్టంలేదు. భీష్ముడు, ధృతరాష్ర్టుడు ఆమెకు అన్యాయం చేశారని భావించాడు. ఆమె జీవితం ఎలా ఉంటుందో అనే ఆందోళనతోపాటు, కురువంశం మీద కోపంతో శకుని కూడా తన దేశం వదిలి కురురాజ్యానికి వచ్చేశాడు. పాండవుల పట్ల దుర్యోధనుడి ద్వేషం అతని మార్గం సుగమం చేసింది.
ఇలా శకుని తన రాజ్యం నుంచి మారినట్టు, ఆయన అంశతో పుట్టినట్టు రాజకీయ క్రీడలు ఆడగలిగిన నారా చంద్రబాబునాయుడు, తనకు అత్యంత నమ్మినబంటు అయిన అనుముల రేవంత్‌రెడ్డిని తన పాచికగా మార్చుకున్నాడు. అకస్మాత్తుగా తెలుగుదేశం పార్టీకి సేవకుడిగా తన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కూలదోయడానికి సందేహించని రేవంత్‌రెడ్డి, ఆ తర్వాత తన పార్టీ వదిలి, కాంగ్రెస్‌లో చేరి, ఆ పార్టీకి తెలంగాణలో అధ్యక్షుడు కావడం, దరిమిలా ఎన్నికల్లో గెలిచి తానే ముఖ్యమంత్రి కావడం, అన్నీ మహాభారత కథలో శకుని జూదం అంత తేలికగా జరిగిపోయాయి.
అయితే నిజంగా ఆశ్చర్యం, అంతకుమించి దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏందంటే స్థానికుడైన రేవంత్‌రెడ్డి తన రాష్ట్రం పట్ల ద్వేషం, తెలంగాణను ధ్వంసంచేసి దోచుకున్న పార్టీ పట్ల ప్రేమ కలిగి ఉండటం. అయితే దీనికి కూడా మన రాష్ట్ర చరిత్రలోనే సమాంతర ఘటన ఉన్నది. అది తెలిస్తే కథ అర్థమవుతుంది. ఒక శాంతి ఒప్పందం కోసం ముసునూరి కాపయనాయక్ తను అప్పటి వరకు పాలించిన గోల్కొండ కోటను 1364లో బహమనీ రాజుకు ఇచ్చేశాడు. తర్వాత పాలించిన కులీకుతుబ్ ఉల్ ముల్క్ దానిని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాడు. అతని వారసులు పాలించినప్పుడు ఔరంగజేబు ఈ రాజ్యాన్ని ఆక్రమించాలని అనేకమార్లు ప్రయత్నించాడు. కానీ దుర్భేద్యమైన గోల్కొండ కోటలోకి ప్రవేశించలేక వెనుదిరిగాడు. అయితే ఇక్కడ అబుల్ హసన్ కుతుబ్‌షా కాలంలో 1687 సెప్టెంబర్ 21న అధికారిగా ఉన్న ఒక మిలిటరీ కమాండర్, ఆఫ్గనిస్థాన్‌కు చెందిన అబ్దుల్లాఖాన్ పన్ని (సరందాజ్ ఖాన్)కు ఔరంగజేబు లంచమిచ్చి కుట్ర చేశాడు. ఆ రోజు అర్ధరాత్రి కోట తలుపులు తెరిచాడు సరందాజ్ఖాన్. అంతే ఔరంగజేబు సైన్యం కోటలోకి ప్రవేశించి, ఈ రాజ్యాన్ని కైవసం చేసుకున్నది. అయితే ఇప్పుడు మనది ప్రజాస్వామ్య దేశమని రాజకీయ నాయకులు నమ్మిస్తున్నారు కాబట్టి వారి కుట్రలు వేరుగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీకి మనసా, వాచా కర్మేణా అంకితమైపోయిన సందాజ్ఖాన్ లాంటి కట్టుబానిసను ఏరుకుని, ముందుగా అతడిని కాంగ్రెస్‌లోకి పంపాడు చంద్రబాబు. కొత్తగా వచ్చినవాడికి పీసీసీ అధ్యక్ష పదవి, తర్వాత ముఖ్యమంత్రి పదవి రావడానికి ఎంత డొనేషన్ చెల్లించారో మనకు తెలియదు. అబద్ధపు మాటలతో బీఆర్ఎస్ మీద అపవాదులు వేసి, మోసపు ప్రమాణాలు చేసి, ఎలాగోలా నేటి సరందాజ్ఖాన్ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక తెలంగాణ గేట్లు ఔరంగజేబుకు బార్లా తెరిచినట్టు అయింది.
ఇక మోసపు జూదం, వనవాసంతో జరిగిన నష్టం బీఆర్ఎస్కే కాదు, తెలంగాణ ప్రజలందరికీ దక్కింది. నిజానికి కాంగ్రెస్ చరిత్ర చూసినా, 1956లో హైదరాబాద్, ఆంధ్ర రాష్ర్టాల బలవంతపు విలీనంతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు, పైగా సుసంపన్న రాష్ట్రం దోపిడీకి గురైంది. వనరులు ఆంధ్ర ప్రాంతానికి, మిగులు నిధులు వలస పాలకులకు దక్కాయి. 44 ఏండ్ల కాంగ్రెస్ పాలన చూసిన తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీలను పూర్తిగా బహిష్కరించాలి. అనుభవం నుంచి కూడా పాఠాలు నేర్చుకోకపోతే ఇంక ఇక్కడ ప్రజలను ఎవరూ కాపాడలేరు. ప్రజలు జాగృతం కాకపోతే ఇంకొక పదేండ్లు సరందాజ్ఖాన్ పాలననే సాగుతుంది జాగ్రత్త!
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాక్షస రాజకీయాలతో అన్ని రాష్ర్టాలను ఆక్రమించి, అక్కడున్న వారిని బాధపెట్టి, ఆయా రాష్ర్టాల్లో వనరులను బడాబాబులకు దోచిపెడుతున్నది. అక్కడ అభివృద్ధి జరిగిన దాఖలాలూలేవు. అదానీ, అంబానీ, ఇతర గుజరాతీ వ్యాపారస్థులు ప్రపంచ కుబేరులవుతుంటే, సామాన్య భారతీయులు దారిద్య్రరేఖ దిగువకు జారిపోతున్నారు. 2014 మే ముందు 19 కోట్ల మంది ఆ రేఖకు దిగువన ఉంటే, 2026 జనవరి నాటికి మరో 20 కోట్ల మంది వారితో చేరారు. అంటే సుమారు 148 కోట్ల భారతీయ ప్రజల్లో 39 కోట్ల మంది పూర్తి దారిద్య్రంలో ఉన్నారన్నమాట! 2014 వరకు దేశం కాంగ్రెస్ పాలనలో ఉన్నప్పుడు దారిద్య్రరేఖ కింద ఉన్న జనాభా 14.7 శాతమైతే, కేవలం 12 ఏండ్ల బీజేపీ పాలనలో అది 12 శాతం పెరిగి 26.7 శాతమైంది. తన వలస ప్రపంచ కుబేరులయిన ఆయన అనుయాయులను చూపి, ‘ఇండియా మెరుస్తున్నది’ అని మోదీ విదేశాల్లో టముకు వేసుకుంటున్నారు. కానీ, నిజానికి ఇండియా కోలుకోలేనంత మసకబారింది. 12 ఏండ్ల బీజేపీ పాలనలో మరి సామాన్య జనాలను పీడించిన గత యుగాల్లోని రాక్షసుల కథలు చరిత్రలో వింటున్నారు కదా ప్రజలు. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవద్దా? శతాబ్దాల చరిత్ర అవసరంలేదు. కనీసం తెలంగాణ రాజుల పాలనలో నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చినప్పటి నుంచి దశాబ్దాల చరిత్ర అయినా ప్రజలు తెలుసుకోవాలి. నిరుద్యోగులు విద్యార్ఙతలు కలిగిన వారే కనుక, వారు పల్లెటూళ్లల్లో, పట్టణాలు, నగరాల్లో ఉన్న నిరక్షరాస్యులైన ప్రజలను చైతన్యపరచాలి. మార్పు అని మాట చెప్పగానే నమ్మడం కాదు, వారి గత చరిత్ర, పరిపాలనను నిశితంగా గమనించాలి. ఒక ఓటు, రెండు రాష్ర్టాలన్న బీజేపీ బూటకపు మాటలు, 2014 నుంచీ స్థానిక పార్టీకి సహకరించకుండా ప్రజలను పీడించిన తీరు, ఒక పథకం ప్రకారం ప్రాంతీయ పార్టీలను నాశనం చేస్తున్న అక్రమాలు, అవినీతి, 12 ఏండ్లలో పెరిగిన సామాన్య ప్రజల గత కష్టాలు తెలంగాణ ప్రజలు గమనించాలి.
ముఖ్యంగా ‘గంగా-జమునా తహజీబ్’ సంస్కృతి కలిగిన తెలంగాణకు బీజేపీ మత విద్వేషానికి పొసగదు. ఆ పార్టీ ఏ ఎన్నికలోనూ గెలువకుండా జాగ్రత్త పడాలి. తెలంగాణను ద్వేషించే బీజేపీ లాంటి పార్టీలను, ఈ సంపన్న రాష్ట్ర వనరులు 5 దశాబ్దాలు దోచుకున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను, ముఖ్యంగా ఆంధ్ర రాజకీయ నాయకులను తెలంగాణ విసర్జించాలి. ఇక్కడి రాజకీయాల్లో నుంచి తరిమికొట్టాలి.
పదేండ్లలో సంపన్న రాష్ట్రంగా నిలిచిన తెలంగాణలో ముఖ్యమంత్రి పీఠం ఇంద్ర సింహాసనంలాగ అయిపోయింది. ప్రస్తుత ముఖ్యమంత్రి తను పదేండ్లు పాలించాలని, హిట్లర్‌ను పూర్తిగా మరిపించాలనీ అనుకుంటున్నాడు. పాతకాలంలోలాగా ప్రజలను ఎట్లాగో మభ్యపెట్టి ఇక్కడ తన తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే తెలంగాణలో తను, ఆంధ్రప్రదేశ్‌లో తన పుత్రరత్నం ముఖ్యమంత్రులుగా వెలగాలని నారా పెద్దనాయుడి ఆకాంక్ష. బీజేపీతో పొత్తు పెట్టుకొని, సనాతనం, సమగ్రత అని లెక్చరిచ్చి తాము గెలిస్తే తను ముఖ్యమంత్రి అవ్వాలని, తన రాష్ట్రంలోని స్టీల్‌ప్లాంట్ గురించే అవగాహన లేదని చెప్పిన జనసేన నాయకుడు కలలు కంటున్నాడు. మరి ఈ నాయకుల చరిత్ర, 2014-23 మధ్య కేసీఆర్ పాలన చూసిన తెలంగాణ ప్రజలు ఎంత చైతన్యవంతులయ్యారో, భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.