హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ‘పోరాడి తెలంగాణను సాధించుకున్నం.. ఒక్కో రంగాన్ని గాడిన పెట్టాలె.. ఇందులో యువతకు ఉపాధి అత్యంత కీలకం. పరిశ్రమలు రాష్ర్టానికి క్యూ కడితేనే యువతకు ఉపాధి సాధ్యం. పరిశ్రమలు రాష్ర్టానికి రావాలంటే వారికి అనుమతులను సులభతరం చేయాలి. ఇందుకు ప్రత్యేకంగా ఓ పాలసీ అవసరం..’ ఇది నాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. ఈ ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న పాలసీయే టీఎస్- ఐపాస్ (తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్). నాడు బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన ఈ పాలసీ సత్ఫలితాలు ఇవ్వడంతో గత నెలలో కేంద్ర ప్రభుత్వ మేధో సంస్థ నీతి ఆయోగ్ సైతం ప్రత్యేకంగా ప్రశంసించింది.
దేశంలోనే ఉత్తమ విధానాల్లో ఒకటిగా టీఎస్-ఐపాస్‌ను కొనియాడింది. తాజాగా తమిళనాడులో సైతం ఇదే స్ఫూర్తితో ఇదే తరహా పాలసీని ప్రారంభించేందుకు ఆ రాష్ట్ర ప్రభు త్వం సన్నద్ధమవుతున్నది. ఈ మేరకు తాజాగా ‘ఫ్యూచర్ రెడీ ఫైనాన్స్-గవర్నెన్స్, గ్రోత్ అండ్ ఇన్నోవేషన్’ అనే థీమ్‌తో నిర్వహించిన ‘సీఐఐ తమిళనాడు ఫైనాన్స్ కాంక్లేవ్-2026’లో పరిశ్రమల అనుమతుల్లో జాప్యానికి చెక్ పెట్టేందుకు త్వరలో కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్టు ఆ రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ ఎంఏ సిద్ధిఖీ తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. 21 రోజుల్లో ఏవైనా కారణాలతో అనుమతులు లభించకపోతే డీమ్డ్ అప్రూవల్ అయ్యేలా పాలసీని తీసుకొస్తామని వెల్లడించారు. త్వరలో ఈ పాలసీని అసెంబ్లీలో ప్రవేశపెడుతారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్.. వ్యవసాయం, సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇస్తూనే, పరిశ్రమలు రాష్ర్టానికి వస్తే యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తాయని భావించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా కొత్తగా కంపెనీ పెట్టాలనుకొనే వారికి ‘ఈజ్ ఆఫ్ డూయిం గ్ బిజినెస్’లో భాగంగా ప్రభుత్వ అనుమతితో పని లేకుండా మొదటిరోజు నుంచే తమ కార్యకలాపాలు సాగించేలా వ్యవస్థను రూపొందించారు. ఆన్లైన్ ద్వారా తమ కంపెనీ వివరాలు అందించి కేవలం 15 రోజుల్లోనే పూర్తిస్థాయి అనుమతి పొందే వెసులుబాటు తీసుకొచ్చారు. ఒకవేళ ఏదైనా కారణాలతో 15 రోజుల తర్వాత అనుమతి లభించకపోతే ఆ మరుసటిరోజు నుంచే నేరుగా ఆన్లైన్ ద్వారా అనుమతి వచ్చేలా టీఎస్-ఐపాస్‌ను రూపొందించారు.