హైదరాబాద్, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందని, శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా తయారైందని, ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని ఓ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు వ్యసనాలకు బానిసలై ప్రిన్సిపాల్‌నే హత్యచేసే స్థాయికి దిగజారడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్‌కు బహిరంగ లేఖ రాశారు. ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేయడమే కాకుండా, ఆమె వద్ద ఉన్న డబ్బు దోచుకెళ్లడం, ఆపై ఏమీ తెలియనట్టు మృతదేహం వద్దకు రావడం విస్తుగొలిపిందని పేర్కొన్నారు.
విద్యా, హోంశాఖను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నప్పటికీ రాష్ట్రంలోని పరిస్థితుల్లో ఎలాంటి మార్పులేదని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో కాకుండా పాఠశాలల్లో సమీక్షలు నిర్వహించాలని సూచించారు. గంజాయి పాఠశాలల్లోకి రాకుండా నియంత్రించాలని, 22ఏ కింద భూములను నిషేధించడం కాకుండా యువతను నాశనం చేస్తున్న మాదకద్రవ్యాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.