హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరసరించింది. ఈ పథకాల అమలుకు ఉన్న చట్టబద్ధత, ప్రజాధనం వినియోగంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు, బడ్జెట్ కేటాయింపులు, శాసనసభ ఆమోదం తదితర అంశాలపై సమగ్ర విచారణ అవసరమని పేరొన్నది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కోసం 2014 నుంచి జారీచేసిన 8 జీవోలను సవాలు చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ వ్యక్తిగత హోదాలో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఏవీ శ్రవణ్ కుమార్ బుధవారం మరోసారి విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. బాల్యవివాహాలను అరికట్టడం, బాలికల విద్యను ప్రోత్సహించడం, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వివాహ సమయంలో ఆర్థిక తోర్పాటు ఇవ్వడమే లక్ష్యంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అమలవుతున్నాయని, ఇవి ప్రజా సంక్షేమ పథకాలని వివరించారు. ఈ పథకాల అమలులో ప్రభుత్వం వైపునుంచి ఏమైనా తప్పు జరిగితే పిటిషన్ల ద్వారా ప్రశ్నించవచ్చని తెలిపారు. ఇలాంటి పథకాలు తెలంగాణకే పరిమితం కాలేదని, ఇతర రాష్ర్టాల్లోనూ వివిధ పేర్లతో ఇలాంటి పథకాలు అమలవుతున్నాయని పేర్కొంటూ.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే ఎత్తివేయాలని కోరారు.
అనంతరం న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. సంక్షేమ పథకాల అమలును కోర్టు వ్యతిరేకించడంలేదని, ప్రజాధనాన్ని ఖర్చు చేయడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రాధాన్యతలను తాము తెలుసుకోవాలని భావిస్తున్నామని స్పష్టం చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు చట్టబద్ధమైన ఆధారం ఏమిటో చెప్పాలని, కేవలం ప్రభుత్వ జీవోలు, ఆర్థికశాఖ అనుమతులు సరిపోతాయా అని ప్రశ్నించారు. ఓ వైపు భూసేకరణలో ఎకరా, అరెకరా భూములు కోల్పోయిన చిన్న, సన్నకారు రైతులు పరిహారం కోసం ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతుంటే నిధుల కొరత ఉన్నదంటూ అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారని, మరోవైపు రిటైర్డ్ ఉద్యోగులకు చట్టబద్ధంగా చెల్లించాల్సిన బకాయిలను చెల్లించలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొన్నదని గుర్తుచేస్తూ.. అప్పులు చేసి సంక్షేమ పథకాలను అమలు చేస్తారా? అని నిలదీసింది. ఆర్టీసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల్లోకి తీసుకొచ్చి, ఆ లాభాలను సంక్షేమ పథకాలకు వినియోగించవచ్చు కదా? అని వ్యాఖ్యానించింది. సంక్షేమ పథకాలు ప్రజలకు భారంగా మారకుండా విశాల దృక్పధంతో ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నది. దీనిపై అదనపు ఏజీ స్పందిస్తూ.. పథకాల కోసం బడ్జెట్లో నిధులు కేటాయించి, శాసనసభ ఆమో దం పొందాక మరో చట్టం అవసరం లేదని, సభ ఆమోదించిన బడ్జెట్ ఆధారంగానే ప్రభు త్వం ఖర్చు చేస్తుందని తెలిపారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.