హైదరాబాద్ ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : పూటకో పంచాయితీ.. అన్ని స్థాయిల నేతల మధ్య నిత్యం కొట్లాటలు.. కమీషన్ల కోసం కక్కుర్తి.. వాటాల కోసం వీధి పోరాటాలు.. పదవుల కోసం పైరవీలు.. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఇది. అటు పార్టీగా, ఇటు ప్రభుత్వంగా అట్టర్ ప్లాప్ అయ్యింది. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, అంతర్గత కుమ్ములాటలు, వాటాల పంచాయితీలతో రోజుకో తీరుగా నేతలు రచ్చకెక్కుతున్నారు. గాంధీభవన్ మొదలుకొని సచివాలయం వరకు నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నది. ఆరు గ్యారెంటీల అమలు, రైతు భరోసా, రుణమాఫీ, ప్రజా సంక్షేమం, ఉద్యోగాలు, అభివృద్ధిని పట్టించుకోవాల్సిందిపోయి.. కుర్చీల లెకలు, పదవుల లొల్లులు, కాంట్రాక్టుల్లో కమీషన్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక భూ దందాలు మంత్రుల మధ్యే చిచ్చుపెట్టే స్థాయిలో సాగుతున్నాయి.
మంత్రి కొండా సురేఖకు సహచర మంత్రులతోపాటు సీఎం రేవంత్‌రెడ్డికి మధ్య రాజుకుంటున్న అంతర్గత విభేదాలు రోజుకో రూపంలో రచ్చకెకుతున్నాయి. సుమారు రూ.71 కోట్ల మేడారం అభివృద్ధి పనుల టెండర్లతో మొదటిసారి బయటపడ్డాయి. ఈ టెండర్లలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జోక్యం చేసుకుంటున్నారంటూ సురేఖ అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆమె భర్త కొండా మురళి పార్టీ అధిష్ఠానాన్ని సంప్రదించడంతో విభేదాలు బహిర్గతమయ్యాయి. గతం లో ఒక సిమెంట్ కంపెనీ వ్యవహారంలో సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై ఆరోపణలు రావడం, ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రాత్రిపూట ఏకంగా మంత్రి ఇంట్లోకి వెళ్లేందుకు ప్ర యత్నించడం, సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనకు సమాచారం ఇవ్వకుండానే ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన పరిధిలోని దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించడాన్ని మంత్రి సురేఖ తీవ్రంగా తప్పుబట్టారు. తాజాగా వరంగల్‌లో సీఎం పర్యటనకు మంత్రి సురేఖ దూ రంగా ఉండటం తీవ్రమైన కుమ్ములాటలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పరకాలలో జరిగిన బహిరంగ సభలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని సీఎం రేవంత్ సమర్థించడంతో మరోసారి వివాదం రచ్చకెక్కింది.
రేవంత్‌కు అత్యంత ఆప్తుడిగా, ప్రభుత్వం లో నంబర్-2 స్థాయి వ్యక్తిగా చక్రం తిప్పిన రెవెన్యూ మంత్రి పొంగులేటి ఇప్పుడు ఊహించని వివాదాల సుడిగుండంలో చికుకున్నారు. కీలక కాంట్రాక్టులు, భారీ ప్రాజెక్టుల కేటాయింపుల్లో స్వప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు, తన కుమారుడిపై వచ్చి న స్మగ్లింగ్, భూ కబ్జా ఆరోపణలు ఆయనను ఉకిరిబికిరి చేసున్నాయి. అత్యంత వివాదాస్పదమైన ‘22ఏ’ నిషేధిత భూముల బాగోతంలో ఉద్దేశపూర్వకంగానే భారీ అక్రమాలకు పాల్పడ్డారన్న తీవ్ర ఆరోపణలు ఏకంగా మంత్రి పదవికే ఎసరు తెచ్చే స్థాయికి చేరాయి. దీనికితోడు నిజామాబాద్‌కు నిధుల మంజూరును అడ్డుకున్న వ్యవహారంలోనూ పోచారం ఆరోపణల వెనుక పొంగులేటి పేరే తెరపైకి రావడం అంతర్గత అసంతృప్తి తీవ్రతను స్పష్టం చేస్తున్నది. భవిష్యత్తులో తన కుర్చీకి పొటెన్షియల్ థ్రెట్‌గా పరిణమిస్తున్న పొంగులేటిని రాజకీయంగా అడ్డుతప్పించాలనే వ్యూహంతోనే, సీఎంవో వర్గాల నుంచే పకాగా లీకులు వదిలి ఈ 22ఏ భూ ముల కుంభకోణంలో ఆయన్ను ఇరికించారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పైకి సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ఢిల్లీ పర్యటనలు, అధికారిక సమీక్షల్లో పాల్గొంటూ అంతా సవ్యంగా ఉన్నట్లే కనిపిస్తున్నా తెరవెనుక తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రభుత్వంలో కీలక విధానపరమైన నిర్ణయాలు, బడ్జెట్ కేటాయింపులు, భారీ కాంట్రాక్టులు, బదిలీలన్నీ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి కోటరీ చేతుల్లోనే కేంద్రీకృతం అయ్యిందని ఉత్తమ్ మథన పడుతున్నట్టు తెలిసింది. ముఖ్యంగా 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయ టెండర్లను రద్దు చేసి, విజిలెన్స్ విచారణకు ఆదేశించిన వ్యవహారంలో ఉత్తమ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్న ట్టు సమచారం. మరోవైపు సాగునీటి పనుల నిధుల నిలిపివేతపై పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేసిన ఫిర్యాదుల్లో తన శాఖ ప్రస్తావన రావడం ఉత్తమ్‌ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి.
సీఎం రేవంత్ స్వయంగా పట్టుబట్టి తన సన్నిహితుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను టీపీసీసీ పీఠంపై కూర్చోబెట్టారన్నది బహిరంగ రహస్యమే. కానీ బాధ్యతలు చేపట్టిన కొద్ది నెలల్లోనే సొంత పార్టీలోని ఒక వర్గం నుంచి ఆయనపై తీవ్ర వ్యతిరేకత మొదలైంది. సీఎంకు సన్నిహితంగా ఉండే మీడియా సంస్థలే మహే శ్ గౌడ్‌పై డిజాస్టర్ ప్రెసిడెంట్ అంటూ కథనా లు ప్రచారం చేయడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోఆర్డినేషన్ కమిటీ భేటీ ఢిల్లీ లో జరగడంతో సీఎంకు, పార్టీకి మధ్య విబేధాలు నిజమేనన్న సంకేతాలు ఇచ్చాయి. దీనికితోడు పీసీసీ చీఫ్‌పై సీఎంవో నిఘా పెట్టిందన్న వార్తలు రావడం, ‘ఏంటీ దాదాగిరీ, బ్లాక్ మెయిల్ రాజకీయాలు?’ అంటూ మహేశ్ గౌడ్ బహిరంగంగానే సవాల్ విసరడం ఇద్దరి మధ్య పెరిగిన అనుమానాల తీవ్రతను బట్టబయలు చేసిందని చర్చ జరుగుతున్నది.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తాజాగా ప్రభుత్వ వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయ దుమారం రేపుతున్నది. తన నియోజకవర్గానికి రావాల్సిన అభివృద్ధి నిధులు, సిద్ధాపూర్ రిజర్వాయర్ పనుల విషయంలో సీఎం రేవం త్ మాట తప్పారని, పెండింగ్ బిల్లులు రాక కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారని బహిరంగంగా ఆరోపణలు చేశారు. ఆరు నెలల్లో బిల్లు లు ఇస్తామన్న సీఎం హామీ నీటిమూటగా మిగిలిందని, మిగతా నిధులను విడుదల చేయకుండా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అడ్డుకున్నారని నేరుగా వేలెత్తి చూపారు. కేసీఆర్ హ యాంలోనే నియోజకవర్గం బాగుపడిందని వ్యాఖ్యానిస్తూ.. ‘రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్న దో లేదో కూడా అర్థం కాని అయోమయం నెలకొన్నది.. నిధుల కోసం మంత్రుల కాళ్లు మొకాలా?’ అంటూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టాయి. మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం ఉన్నదని, పాలన మొత్తం కేవలం ‘ఒకరి చుట్టూనే కేంద్రీకృతమైనది’ అంటూ తప్పుబట్టారు. అటు వనపర్తిలో సీనియర్ కాంగ్రెస్ నేత జీ చిన్నారెడ్డి సైతం ఫిరాయింపుదారులకు రెడ్ కార్పెట్ వేస్తూ తనలాంటి అసలైన నేతలను విస్మరిస్తున్నారని, తాను మరో ‘జీవన్‌రెడ్డి’లా మారాల్సి వస్తుందంటూ హెచ్చరించారు.
పాలనలో విఫలం కావడం ఒక ఎత్తుకాగా, మంత్రులపై, వారి కుటుంబ సభ్యులపై తీవ్ర అవినీతి ఆరోపణలు రావడం దుమారాన్నే రేపుతున్నాయి. ఒక శాఖ మంత్రిపై ఏకంగా ‘పర్సంటేజ్ మినిస్టర్’అనే ముద్ర పడింది. మరో మంత్రిపై ఏకంగా ‘ప్రభుత్వ భూమిని వదలడు’ అనే ముద్ర పడిపోయింది. అధికార పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కూడా ప్రత్యక్షంగా ఆరోపణలు చేశారు. అయితే ముఖ్యనేత ఆధ్వర్యంలోనే తమపై బురదచల్లే కార్యక్రమం జరుగుతున్నదని మంత్రులు అసహనంతో ఉన్నారు. ఇక ‘బిగ్’బ్రదర్స్’ సంగతి సరేసరి. రాష్ట్రంలో పెద్దపెద్ద వ్యవహారాలు, భూ కుంభకోణాల వెనుక బిగ్ బ్రదర్స్ హస్తం బయట పడుతూనే ఉన్నది.
పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ అసలు స్వరూపం తేటతెల్లమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వారు ప్రస్తుతం రెండే పనులు పెట్టుకున్నారని.. మైకు అందుకుంటే కేసీఆర్‌ను, కేటీఆర్‌ను, హరీశ్వును తిట్టడం, లేదంటే తమ లో తామే కుమ్ములాడుకోవడమే చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. వారి అసలు లక్ష్యం ప్రజా సంక్షేమం కాదని, అంతర్గతంగా సాగుతున్న మంత్రి పదవుల పంచాయితీలు, నియోజకవర్గాల టికెట్ల యుద్ధాలు, అభివృద్ధి నిధుల్లో కమీషన్ల వేట, పదవులపై పెత్తనమేనని స్పష్టమవుతున్నదన్నారు. వా టాల పంచాయితీ కాస్తా ఇప్పుడు మూటల కొట్లాటగా మార్చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచ్ఛన్న యుద్ధం రానున్న రోజుల్లో కాంగ్రెస్ పునాదులనే పెకిలించివేవేస్తదన్న చర్చ జోరందుకున్నది.
అధికారంలోకి వచ్చిన కొత్తలో కొన్ని రోజులు మౌనంగా ఉన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి.. కొన్ని నెలలుగా సొంత ప్రభుత్వంపైనే రోజుకో బాణం విసురుతున్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు రో జురోజుకూ కనుమరుగవుతున్నారని, వల స నేతల హవానే నడుస్తున్నదని విమర్శిస్తున్నారు. ప్రభుత్వంలో ప్రజా సంక్షేమం కం టే ఆడంబరాలే ఎకువయ్యాయని, ముఖ్యమంత్రి రేవంత్ వ్యవహారశైలి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తాజాగా స్వరం పెంచుతూ.. పార్టీ జాతీయ సిద్ధాంతాలను, విలువలను పకనపెట్టి ఇతర పార్టీల నుంచి విచ్చలవిడిగా నేతలను చేర్చుకోవడం వల్ల ప్రజల్లో పార్టీ పరపతి దిగజారుతోందని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయాలు సీమాంధ్ర పాలకుల కనుసన్నల్లో నడుస్తున్నాయంటూ విమర్శలు చేశారు. ‘పదవులు మీకే.. పైసలూ మీకేనా?’ అంటూ నిలదీస్తూ, సొం త పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు, రోడ్డు కాంట్రాక్టర్ల బిల్లులకు నిధులు విడుదల చేయడం లేదని బహిరంగంగా అసంతృప్తి వెళ్లగకారు. తప్పుడు పద్ధతులపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ నేరుగా సీఎం రేవంత్‌నే నిలదీయాలని సవాల్ విసిరారు.
మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ బుధవారం చేసిన సంచలన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం వాటాల పంచాయితీ అని ఒక వర్గం అభిప్రాయపడున్నది. మరోవర్గం మాత్రం సీఎం రేవంత్‌రెడ్డి వారిని పొమ్మనలేక పొగపెడుతున్నారని, అది గ్రహించే ఆమె తాజా వ్యాఖ్యలు చేసిందని అంటున్నారు. ఇటీవల సీఎం పరకాల, ములుగు జిల్లాలో పర్యటించారు. తనకు మాట మాత్రమైనా చెప్పకుండా సీఎం మేడారం టూర్‌ను పెట్టుకోవటం, పైగా తన శాఖ పరిధిలోని మేడారం వచ్చినా ములుగు జిల్లా మంత్రి సీతక్కగానీ, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిగానీ తనకు సమాచారం ఇవ్వలేదని మంత్రి కొండా సురేఖ అలిగినట్టు సమాచారం.
ములుగు సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో కన్నా పరకాలలో బహిరంగసభలో సీఎం పరోక్షంగా కొండా కుటుంబ రాజకీయ ఎదుగుదలను తొక్కేసేలా ప్రసంగించారని కాంగ్రెస్‌లో విస్తృత చర్చకు దారితీసింది. మరోవైపు కొండా దంపతులు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయటం వంటి పరిణామాలతో.. వారి మధ్య వైరం వాటాల పంచాయితీతోపాటు రాజకీయ పంచాయితీగా రూపాంతరం చెందుతున్నదనే వాదన వినిపిస్తున్నది.