JEE Mains | హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : ఐఐటీలు, ఎన్ఐటీల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్-1 పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యా యి. తొలిరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లల్లో పరీక్షలు నిర్వహించగా, ప్రశ్నలు మధ్యస్తంగా ఉన్నట్టు.. అన్ని అంశాల నుంచి ప్రశ్నలిచ్చినట్టుగా విద్యార్థులు తెలిపారు. భౌతికశాస్త్రంలో థర్మల్ ఫిజిక్స్, ప్రొజెక్షనల్ మోషన్, ఎలక్ట్రికల్ సర్యూట్, డయోడ్, విద్యుదయస్కాంత తరంగాలు వంటి వాటి నుంచి ప్రశ్నలిచ్చారు. లోతైన పరిజ్ఞానం కలవారే ఈ ప్రశ్నలను ఛేదించగలరు. ఇక గణితంలోని ప్రశ్నలకు ఆన్సర్లు రాబట్టేందుకు అధిక సమయం పట్టింది. గణాంకాలు, సంభావ్యత, వెక్టర్స్, త్రీడీ జ్యా మితి, నిర్ణాయకాల అంశాలనుంచి ప్రశ్నలిచ్చారు.
మొత్తం మూడు విభాగాల్లో కెమిస్ట్రీ సులభంగా ఉండగా, ఫిజిక్స్, గణితం ప్రశ్నలకు కాస్త సమయం పట్టిం ది. గణితం ప్రశ్నలకు అధిక సమయం పట్టిందని శ్రీచైతన్య ఐఐటీ ఆలిండియా కో-ఆర్డినేటర్ ఎం ఉమాశంకర్ విశ్లేషించారు. గతంలో ఫిజిక్స్, కెమిస్ట్రీలు విద్యార్థులను ఇబ్బందిపెట్టేవని,ఈ రెండు సబ్జెక్టుల్లో ప్రశ్నలు సులభంగానే ఇచ్చినట్టు వెల్లడించారు. 100కు 95 పర్సంటైల్ స్కోర్ సాధించవచ్చని తెలిపారు. గురు, శుక్రవారాలతోపాటు ఈ నెల 28న బీటెక్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనుండగా, ఈ నెల 30న బీఆర్క్, బీప్లానింగ్ విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తారు.