చిల్పూరు, జనవరి 1: జర్మనీలోని మాగ్డేబర్గ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో జనగామ జిల్లాకు చెందిన విద్యార్థి మృతి చెందాడు. జనగామ జిల్లా చిల్పూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల సంపత్‌రెడ్డి-స్వర్ణ దంపతుల కుమారుడు హృతిక్‌రెడ్డి (24) ఉన్నత విద్యాభ్యాసం కోసం జర్మనీకి వెళ్లాడు. అక్కడ మాగ్డేబర్గ్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు.
డిసెంబర్ 29న అక్కడ అగ్నిప్రమాదం జరగ్గా, మంటల నుంచి తప్పించుకోవడానికి అపార్ట్మెంట్ నుంచి కిందికి దూకడంతో తలకు తీవ్ర గాయమైంది. దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కుటుంబసభ్యులకు బుధవారం రాత్రి సమాచారం అందగా, వారి రోదనలు మిన్నంటాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.