Cabinet Expansion | హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ రేపో మాపో అనుకుంటున్న దశలో మరోసారి వాయిదా పడటంతో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఉడుము మూతికి తేనె పూసి కొండలు ఎక్కించినట్టుగా.. 4+2 ఫార్మలా మంత్రివర్గ విస్తరణతో ఔత్సాహికులను ఊరడిద్దామనుకున్న అధిష్ఠానానికి ఆశాభంగమే ఎదురైంది. సీనియర్ నేత జానారెడ్డి అధిష్ఠానానికి లేఖ కారణంగానే విస్తరణ ప్రక్రియకు బ్రేకులు పడినట్టు భావిస్తున్నారు. ఆ లేఖలో ఏం రాశారో కచ్చితంగా బయటకు రాలేదుగానీ, దాని ప్రభావం మాత్రం గట్టిగానే కనిపిస్తున్నది. కసరత్తు లేకుండా కూర్పు జరిగితే ప్రభుత్వ మనుగడ ప్రమాదంలో పడటం ఖాయమని ఆయన హెచ్చరించి ఉంటారని గాంధీభవన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మంత్రివర్గంలో ఆరు స్థానాలు ఖాళీ ఉండగా దాదాపు 30మంది ఔత్సాహికులు పోటీపడుతున్న విషయం తెలిసిందే. అధిష్ఠానం దూత మీనాక్షి నటరాజన్ తెలంగాణకు వచ్చి దాదాపు 20రోజులు ఇక్కడే మకాం వేసి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆమె నుంచి అందిన సిగ్నల్ మేరకే టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానంతో కూర్పుపై చర్చించి వచ్చారు. ఈ నలుగురిలో ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు కలిసి ఒక జాబితా, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వేర్వేరుగా చెరో జాబితా కాంగ్రెస్ అధిష్ఠానానికి ఇచ్చినట్టు తెలిసింది.
నల్లగొండ జిల్లా నుంచి ఒక్క రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వటం వలన ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్‌సాగర్‌రావుకు, వరంగల్ జిల్లా నుంచి దొంతి మాధవరెడ్డికి, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డికి చెక్ పెట్టినట్టు అవుతుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇది నూటికి నూరుపాళ్లు ముఖ్యనేత రాజకీయ వ్యూహమేనని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ సీనియర్ నేత జానారెడ్డి రాసిన లేఖ ఆ పార్టీలో కాకరేపుతున్నది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు అసలు మంత్రివర్గంలో ప్రాధాన్యం లేకుండా పోయిందని, ఈ రెండు జిల్లాలు రాష్ట్రంలో ప్రధానమని ఆయన లాజికల్ పాయింట్ లేవనెత్తారట. కానీ ఈ ఒక్క పాయింట్‌తోనే పార్టీలో ఇంత వేడి పుడుతున్నదంటే కాంగ్రెస్ నేతలు ఎవరూ నమ్మటం లేదు. కొత్త మంత్రులను ప్రమాణ స్వీకారానికి పిలుద్దామని డేట్ ఫిక్స్ చేసుకున్న అధిష్ఠానం జానారెడ్డి ఇచ్చిన షాక్‌తో.. విస్తరణకు బ్రేక్ వేసిందంటే లేఖలో ఇంకేదో ప్రస్తావించి ఉంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి.
మంత్రి పదవులకు ఆశపడి గోడ దూకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎవరూ పట్టించుకోలేదని, వారి చేత రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు వెళ్లకుండా ఉండటమే వారికి లభించే గొప్ప పదవి అన్నట్టు పరిస్థితి ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో అసంతృప్తివాదులు అంతా ఒక్క చోట కలిస్తే 20 మంది అవుతున్నారని ఢిల్లీ కాంగ్రెస్‌కు నివేదికలు అందినట్టు తెలిసింది. దీనితోపాటు దక్షిణ తెలంగాణకు చెందిన కీలక నేత ఒకరు పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయనకు అత్యంత ఆప్తునిగా గుర్తింపు ఉన్న ఓ మంత్రిని కూడా తొలగిస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆయన ఈ అందరిని ఒక చోటకు తీసుకువచ్చే అవకాశం ఉందని సొంత నిఘా వర్గాలు హెచ్చరించినట్టు తెలిసింది.
మరోవైపు సుదర్శన్‌రెడ్డి పేరు తెరమీదకు రావటంతో నర్సంపేట ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నేత దొంతి మాధవరెడ్డి ఢిల్లీ వెళ్లారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌ను కలిశారు. ఇంకోవైపు తన భార్యకు మంత్రి పదవి ఇవ్వకుంటే ఊరుకునేది లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మెట్టు దిగకుండా గట్టి పట్టుదలతో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణను వాయిదా వేయడమే మేలు అని అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం.
‘మంత్రివర్గంలో నాకు చోటు లేకుంటే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేసినట్టే. ఆదివాసీలకు, పార్టీ కార్యకర్తలకు ఊపిరిగా నిలిచిన నాకే అన్యాయం చేస్తారా? పదేండ్లు పార్టీని కాపాడుకుంటే ఇదేనా మాకిచ్చే గౌరవం. వేరే పార్టీలు తిరిగొచ్చిన వారికి పదవులు కావాలా? అలా ఇస్తానంటే కుదరదు.
– మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు
‘మంత్రి పదవి రాకుండా సీనియర్ నేత జానారెడ్డి అడ్డం పడుతున్నారు. ధర్మరాజులా ఉండాల్సిన వ్యక్తి.. ధ్రుతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్నారు. 30 ఏండ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలనే విషయం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? మంత్రి పదవి అడుకుంటే వచ్చేది కాదు..కెపాసిటీతో వస్తుంది’
– మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
‘నేను బీజేపీలో ఉండి ఉంటే కేంద్రమంత్రిని అయ్యేవాన్ని. రేవంత్‌రెడ్డి ఆహ్వానిస్తే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాం. గడ్డం కుటుం బం పోటీ చేయడం వల్లనే ఈ ప్రాంతంలో (ఆదిలాబాద్ జిల్లాలో) కాంగ్రెస్ గెలిచింది’.
– చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్