హైదరాబాద్, మార్చి 17 (నమస్తేతెలంగాణ) : కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య అసెంబ్లీ ఆవరణలో సోమవారం సాయంత్రం కాసేపు సరదా సంభాషణ కొనసాగింది. నియోజకవర్గాల పునర్విభజనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడి వెళ్తుండగా అదే సమయంలో అటుగా వచ్చిన కేటీఆర్.. జానారెడ్డిని చూసి ఆయన వద్దకు వెళ్లారు.
‘మీ ఆరోగ్యం ఎలా ఉన్నది’ అంటూ జానారెడ్డిని అడిగారు. అందుకు ప్రతిస్పందనగా ‘నా ఆరోగ్యం బాగున్నది. నా ఏజ్ ఎంత ఉంటుందో మీకు తెలుసా?’ అని జానారెడ్డి అడుగగా.. 70 ఏండ్లకు పైగా ఉండొచ్చనుకుంటున్నానంటూ కేటీఆర్ సమాధానమిచ్చారు. దీనికి జానారెడ్డి స్పందిస్తూ.. ‘కాదు.. నాకు 79 ఏండ్లు పూర్తయ్యాయి’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు.
‘మీ అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వండి’ అని జానారెడ్డిని కేటీఆర్ కోరారు. వాళ్లను ఫొటో తీసేందుకు పలువురు ఫొటోగ్రాఫర్లు ముందుకు రాగా ‘ మా జానారెడ్డితో ఫొటో దిగేందుకు భయం లేదు’ అంటూ ఆయనతో కలిసి కేటీఆర్ ఫొటో దిగారు.