సిటీబ్యూరో/కవాడిగూడ, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను మరింత చీకట్లోకి నెట్టేస్తున్నాయని కార్మిక సంఘాలు మండిపడ్డాయి. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని అల్టీమేటం జారీ చేశాయి. సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం ఇందిరాపార్క్ వద్ద జరిగిన మహాధర్నాలో కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. ఆర్టీసీ కల్యాణ మండపం నుంచి ఇందిరాపార్క్ వరకు భారీ ర్యాలీ తీశారు.
ఈ నిరసనలో కార్మికులకు మద్దతివ్వడానికి విచ్చేసిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఎదుట కార్మికులు తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేవలం మద్దతిచ్చి చేతులు దులుపుకొంటే కుదరదని, కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న లేబర్ కోడ్ల రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని బీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల మారయ్య డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆటో డ్రైవర్ల చావులకు కారణమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ల రక్షణకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మాటిచ్చి చోద్యం చూస్తున్నదన్నారు. కాగా, ఈ సమ్మెల్లో ఏఐటీయూసీ అధ్యక్షుడు బాలరాజు, సీఐటీయూ అధ్యక్షుడు పాలడుగు భాస్కర్, టీఏడీఎస్ అధ్యక్షుడు సత్తిరెడ్డి, టీయూసీఐఎస్ ఎల్ పద్మ, సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ నాయకుడు హన్మేశ్, ఐఎఫ్టీయూ శ్రీనివాస్, ఐఎన్జీయూసీ ప్రకాశ్ గౌడ్, హెచ్ఎంఎస్ రెబ్బ రామారావు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తోనే ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు
సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆటో డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా పాటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాము ఉపాధి కోల్పోవాల్సి వచ్చిందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బస్సుతో గిరాకీ లేక కుటుంబాన్ని నడపలేక ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఏటా రూ.12 వేలు ఇస్తామని ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆర్టీసీ కల్యాణ మండపం నుంచి ఇందిరాపార్క్ వరకు ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ తీశారు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు బంద్‌లో పాల్గొన్నారు.
బంద్‌తో రెట్టింపు వసూలు..!
బంద్ ప్రభావంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. వాహన యాప్ ఆధారిత సేవలు కూడా 90 శాతం నిలిచిపోయాయి. కొన్ని సర్వీసులున్నా రెట్టింపు ధరలు విధించారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ప్రయాణికులు అధిక డబ్బులు చెల్లించి గమ్య స్థానాలకు చేరుకోవాల్సి వచ్చింది. ఓలా, ర్యాపిడో, ఉబర్ సర్వీసులు అధిక చార్జీలు వసూలు చేయడంపై నగరవాసుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. సికింద్రాబాద్ నుంచి బంజారాహిల్స్‌కు 110 రూపాయలు సాధారణంగా ఉండగా 190 రూపాయలు వసూలు చేశారు. 50 రూపాయల గమ్యస్థానానికి రూ.150 వరకు కొంతమంది ఆటో డ్రైవర్లు ప్రయాణికుల నుంచి వసూలు చేశారని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి
రైతు, కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు పల్పడుతున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేంరుకు లౌకిక శక్తులన్నీ ఏకమై ఉద్యమించాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను, కార్మిక రైతు వ్యతిరేక నల్ల చట్టాలను నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా హైదరాబాద్‌లో రైతు, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఆర్టీయూ, టీయూసీఐ, ఐఎఫ్బీఆర్, ఏఐయూటీయూసీ తదితర రైతు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రదర్శనలో వేలాది మంది కార్మికులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు ప్రదర్శనలో పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ర్యాలీ బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపం నుంచి ప్రారంభమై ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్నగర్చౌరస్తాల మీదుగా ఇందిరాపార్కు వరకు సాగింది. అనంతరం ఇందిరాపార్కు వద్ద జరిగిన బహిరంగ సభలో ఏఐటీయూసీ నాయకులు ఎం.నర్సింహ, చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఏఐటీయూసీ నాయకులు ఎస్.బాల్‌రాజ్, సీఐటీయూ నాయకులు పాలడుగు భాస్కర్, టీయూసీఐ నాయకురాలు ఎస్.పద్మ, బీఆర్టీయూ నాయకులు రాంబాబుయాదవ్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ, ఐఎన్టీయూసీ నాయకులు మెగుళ్ల రాజిరెడ్డి, కమతం యాదగిరి, ప్రేమ్‌పావని తదితరులు పాల్గొన్నారు. బంద్ పూర్తిగా విజయవంతం అయ్యిందని నాయకులు తెలిపారు.