హైదరాబాద్, నవంబర్9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ బీసీలను నమ్మించి మోసగించిందని, ఆ పార్టీ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకభావం ఉన్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఒక ప్రకటనలో విమర్శించారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 34 సీట్లు కేటాయిస్తామని ఊదరగొట్టిన ఆ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ కంటే తక్కువ సీట్లు కేటాయించి ఆ హామీనే తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు.
ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో బీసీలకు రెండు సీట్లు కేటాయిస్తామని ఆ పార్టీ తీర్మానం చేసిందని, చివరకు 23 సీట్లే ఇచ్చిందని పేర్కొన్నారు. డిపాజిట్ కూడా రాని పాతబస్తీలోని ఐదు సీట్లను కేటాయించి బీసీలను అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌నే అమలు చేయని కాంగ్రెస్ నేతలు, అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. రెండోరోజుల్లో బీసీల భవిష్యత్తు రాజకీయ కార్యాచరణను ప్రటిస్తామని, బీసీలకు ద్రోహులెవరో, దొంగలెవరో తేల్చుతామని స్పష్టం చేశారు.