ఖైరతాబాద్, జనవరి 18 : వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు అవకాశం ఇవ్వాలని, లేకుంటే ఆ పార్టీకి సమాధి కడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలపై కాంగ్రెస్ వైఖరిని ఖండించారు. త్వరలోనే వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గ టీచర్స్ ఎమ్మెల్సీ, కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ నియోజకవర్గ పట్టభద్రుల, కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కులగణన చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అధిక శాతం జనాభా ఉన్న బీసీలకే ఆయా ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం జరిగితే తమ అభ్యర్థులను ఇండిపెండెంట్‌గా నిలబెట్టి గెలిపించుకుంటామని వెల్లడించారు. సమావేశంలో బీసీ సంఘాల నాయకులు కుందారం గణేశ్‌చారి, బాలరాజుగౌడ్, విక్రమ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కులాల పేర్ల మార్పు పై 500 విజ్ఞప్తులు
హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): బీసీ జాబితాలోని 8 కులాలకు చెందిన పేర్లలో మార్పులపై బీసీ కమిషన్‌కు 500లకు పైగా విజ్ఞప్తులు వచ్చాయని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. తమ కులాల పేర్లను దూషణలకు వాడుతున్నారని దొమ్మర, పిచ్చుకుంట్ల, తమ్మలి, బుడబుకల, కుమ్మర, చాకలి, చిప్పోలు, వీరముష్టి కులాల ప్రతినిధులు బీసీ కమిషన్‌ను అ భ్యర్థించారు. అభ్యంతరాల స్వీకరణకు గడువు ముగియగా 500కు పైగా విజ్ఞప్తులు వచ్చినట్టు నిరంజన్ తెలిపారు.