జగిత్యాల, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పరిణామాలు, పార్టీ వ్యవహారశైలి చూస్తుంటే అసలు పార్టీలో ఉండుడా? పోవుడా? అనిపిస్తున్నదంటూ ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి టీ జీవన్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేకు ప్రాధాన్యమివ్వడం, సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలను మానసికంగా వేధిస్తూ రాజకీయంగా అణగదొక్కడం తనను మానసికంగా కలచివేస్తున్నదని.. అధిష్ఠానం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా మార్పు రావడం లేదని వాపోయారు. అధిష్ఠానం వైఖరి, సీఎం వ్యవహారశైలితో విసిగిపోయిన ఆయన, సోమవారం జగిత్యాలలో మీడియా ముఖంగా తన ఆవేదన, దుఃఖాన్ని వెల్లబోసుకున్నారు. మా నసిక క్షోభను ఇంకా ఎన్నాళ్లు భరించాలో అ ర్థం కావడం లేదని, అధిష్ఠానంలో మార్పు రాకపోతే ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదని స్పష్టంచేశారు. ‘జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల్లో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు బీ ఫామ్స్ ఇవ్వాలని, వలసవాదులకు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తే, ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలను ముంచేసి, వలసవాదులకు అధిష్ఠానం బీఫామ్స్ ఇచ్చింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విధి లేని పరిస్థితుల్లో కార్యకర్తల కోసం వారిని గెలిపించానని తెలిపారు. ఎమ్మెల్యే ప్రతిపాదించిన వారిపై 10మంది అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచారని, వారి గెలుపు కోసం పాటుపడ్డానని పేర్కొన్నారు.