హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నిమార్లు ప్రయత్నించినా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ దక్కకపోవడం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. తెలంగాణకు చెందిన దాదాపు ప్రతి సీనియర్ నేతను కలుస్తున్న రాహుల్‌గాంధీ.. సీఎం రేవంత్‌తో భేటీకి మాత్రం ససేమిరా అంటున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సోమవారం కుటుంబసమేతం ఢిల్లీ వెళ్లి రాహుల్‌గాంధీని కలిశారు. తన కూతురు పెళ్లికి రావాలంటూ శుభలేఖ అందించారు. దీనిపై ఇటు పార్టీలో అటు సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతున్నది. రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ సీఎం రేవంత్‌రెడ్డికి తప్ప అందరికీ దక్కుతున్నదని పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి నచ్చని రాహుల్‌గాంధీ ఆయనను దూరం పెడుతున్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే ఆపాయింట్మెంట్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని చెప్తున్నారు. అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ను కలవాలని సూచిస్తున్నట్టు తెలిసింది.
సీఎం రేవంత్‌రెడ్డికి సుమారు ఏడాదినుంచి అపాయింట్మెంట్ ఇవ్వని రాహుల్‌గాంధీ రాష్ర్టానికి చెందిన పార్టీ నేతలను మాత్రం అడపాదడపా కలుస్తూనే ఉన్నారు. రెండు నెలల క్రితం పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా రాహుల్‌గాంధీని కలిశారు. ఆ తర్వాత మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు,ఎంపీ మల్లు రవి భేటీ అయ్యారు. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి రాహుల్‌గాంధీని ఆహ్వానించినా ఆయన రాలేదు. ధర్నా అనంతరం సీఎం రేవంత్ తిరిగి వచ్చాక పలువురు నేతలతో రాహుల్ భేటీ అయినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.