నీలగిరి, మార్చి 18: అర్హులైన ప్రతి ఒకరూ ఓటరుగా నమోదు కావాలన్నదే ఎన్నికల సంఘం ఉద్దేశమని, త్వరలో చేపట్టనున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమానికి గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్ పేర్కొన్నారు. బుధవారం తన చాంబర్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం షెడ్యూల్ను జారీ చేయనున్నదని, ఇందులో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ బూత్ల వారీగా ఏజెంట్లను నియమించాలని సూచించారు.
2002లో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహించారని, 25 సంవత్సరాల తర్వాత తిరిగి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. ఇందులో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎస్ఐఆర్లో మ్యాపింగ్ కానీ వారిని తప్పనిసరిగా మ్యాపింగ్ చేసుకోవాలని చెప్పాలన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా మ్యాపింగ్ కాని వారంతా మ్యాపింగ్ అయ్యేలా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల ఇంచార్జి అదనపు కలెక్టర్, నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల నేతలు బక్కా పిచ్చయ్య, పుచ్చకాయల నర్సిరెడ్డి, ముంతాజ్ అలీ, లింగస్వామి, రఫీ, అద్దంకి రవి, యాదగిరి, బషీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.