హైదరాబాద్, మార్చి 18(నమస్తే తెలంగాణ) : కరీంనగర్ సీపీ గౌస్ ఆలం ఫైరింగ్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిట్ వేయాలని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఘటనలో సీపీతో పాటు హుజూరాబాద్ ఏసీపీ, జమ్మికుంట సీఐపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. తన ఆరోపణల తర్వాత సీపీ సెలవులో ఉన్నట్టు ఆగమేఘాల మీద ఒక లేఖ విడుదల చేశారని, అందులో కూడా తేదీని పెన్నుతో రాశారని దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సీపీకి సెలవులు డీజీపీ ఇస్తారని, లేఖలో మాత్రం ఐజీ ఇచ్చినట్టు ఎలా చూపుతారని మండిపడ్డారు. ఫైరింగ్ జరిగిన చోట ప్యాచ్‌వర్క్ చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. రాష్ర్టానికి హోం మంత్రిగా కూడా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని, ఈ నెల 30లోగా చర్యలు తీసుకోకపోతే మరిన్ని విషయాలు బయటపెడతానని కౌశిక్‌రెడ్డి స్పష్టంచేశారు.
పోలీసు వ్యవస్థపై తనకు గౌరవం ఉన్నదని, ఇలాంటి అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంలో తాను తప్పు మాట్లాడితే అసెంబ్లీ ముందు ముక్కు నేలకు రాస్తానని కౌశిక్‌రెడ్డి సవాల్ విసిరారు. సీపీ ఫైరింగ్ అంశంపై అసెంబ్లీలో జీరో అవర్‌లో ప్రస్తావించగా మంత్రి శ్రీధర్‌బాబు విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.