దుండిగల్, మార్చి18: అత్యవసర సమయంలో తీసుకున్న వేగవంతమైన నిర్ణయం.. వైద్యుల అద్భుత సమన్వయం పదేళ్ల బాలుడి జీవితాన్ని మార్చేసింది. తీవ్ర ప్రమాదానికి గురై, కాలు తీసేయాల్సిన పరిస్థితిలో ఉన్న బాలుడికి సూరారంలోని మల్లారెడ్డి నారాయణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి కాలును కాపాడారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తీసుకువచ్చేసరికి కుడి కాలు పూర్తిగా చల్లబడిపోవడంతో పరీక్షించిన వైద్యులు కుడి కాలులోని ప్రధాన రక్తనాళం దెబ్బతిని రక్తప్రసరణ ఆగిపోయినట్లు గుర్తించారు.
పాదంలో ఆక్సిజన్ స్థాయి సున్నాకు పడిపోవడంతో కాలు తొలగించాల్సిన ప్రమాదం ఏర్పడింది. వైద్యశాలకు చెందిన వాస్క్యులర్ సర్జన్ డా.కె.అతిరథ్రెడ్డి నాయకత్వంలోని బృందం వెంటనే రంగంలోకి దిగింది. కుడి మిడ్ ఫిమోరల్ ఆర్టరీ నుంచి డిస్టల్ పాప్లిటేయల్ ఆర్టరీ వరకు బైపాస్ నిర్వహించారు.రక్తనాళాల్లో పేరుకుపోయిన గడ్డలను తొలగించి రక్తప్రసరణను పునరుద్ధ్దరించారు. పిల్లల్లో ఇలాంటి వాస్యులర్ గాయాలు కేవలం 0.6 శాతం మాత్రమే జరుగుతుంటాయని, రక్తనాళాలు చిన్నవిగా ఉండ టం వల్ల ఈ సర్జరీ చాలా క్లిష్టమైనదని.. కానీ సరైన సమయంలో స్పందించడం వల్ల బాలు డి కాలును కాపాడగలిగినట్లు సర్జన్ తెలిపారు.
వైద్యబృందం కృషి అభినందనీయం..
ఈ చికిత్సలో ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీ, అనస్థీసియా విభాగాల సమన్వయాన్ని ఆసుపత్రి చైర్మన్ డా.సీహెచ్ భద్రారెడ్డి, వైస్ చైర్మన్ డా.ప్రీతిరెడ్డి, సీఈఓ డా.రాకేశ్ప్రభు అభినందించారు. అత్యాధునిక సాంకేతికత, నైపుణ్యం కలిగిన వైద్యులు ఉండటం వల్లే ఇలాంటి అరుదైన విజయాలు సాధ్యమవుతున్నాయని వారు పేర్కొన్నారు. డిశ్చార్జ్ సమయంలో బాలుడి కాలులో రక్తప్రసరణ 100 శాతం సాధారణ స్థితికి చేరుకుందని, బాలుడు ఇప్పుడు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలుడి ప్రాణాలు కాపాడిన మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రి యాజమాన్యం, అక్కడి వైద్య బృందానికి బాలుడి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.