సూర్యాపేట, మే 1 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ సభలో కేసీఆర్ తన పేరును ఉచ్ఛరించలేదన్న కారణంతో సీఎం రేవంత్‌రెడ్డి అక్కసు వెళ్లగక్కడంపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులే ఆయన పేరు మర్చిపోతున్నారని తెలిపారు. కనీసం ఒక్కటైనా మంచి పనిచేస్తే ఎవరో ఒకరు రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తిస్తారని పేర్కొన్నారు. పదోతరగతి ఫలితాల విడుదల, బసవేశ్వర జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి అసలు విషయం పక్కన పెట్టి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం జగదీశ్‌రెడ్డి సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ సభ జరిగిన తీరును చూసి కాంగ్రెస్ నేతల ముఖాలు వాడిపోయాయని తెలిపారు. కాంగ్రెస్ అంటే తాను ఒక్కడినేనన్న భ్రమలో రేవంత్ ఉన్నారని, ఆయనకు కాంగ్రెస్ పార్టీ కన్నా వ్యక్తిగత ప్రచారంపైనే ఆసక్తి ఎక్కువని ఎద్దేవా చేశారు. సోనియా గాంధీని బలిదేవత అన్న మాటలు మర్చిపోయావా? అని రేవంత్‌ను ప్రశ్నించారు. తెలంగాణలో పదవులు అనుభవిస్తూ ఆంధ్రాకు వత్తాసు పలుకడం సిగ్గుచేటని అన్నారు. ఎన్ని రోజులు సీఎం పదవిలో ఉంటాడో గ్యారెంటీ లేని రేవంత్‌రెడ్డి.. అడ్డగోలు హామీలిచ్చి అమలు చేయలేక కేసీఆర్‌పై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముమ్మాటికీ తెలంగాణకు కాంగ్రెస్ పార్టీనే విలన్ అని పేర్కొన్నారు. 1969 ఉద్యమ సమయంలో 359 మందిని కాల్చి చంపిన పాపం కాంగ్రెస్‌ది కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ దీక్షా సమయంలో విద్యార్థుల బలిదానాలకూ కాంగ్రెస్సే కారణమని మండిపడ్డారు.