Jagadish Reddy | అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బట్టలు విప్పే కార్యక్రమం మొదలైందనే తనపై సస్పెన్షన్ విధించారని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ సభ్యులతో నిరసన తెలిపిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సస్పెన్షన్‌కు ఒక్క కారణం చూపించలేదు. శాసనసభ్యులు అందరూ వెళ్లి స్పీకర్ వద్దకు వెళ్లారు. దురదృష్టవశాత్తు స్పీకర్ వారిని ఏమీ అనలేక.. మమ్మల్ని అనే పరిస్థితి వచ్చింది. నేను మాట్లాడడం ప్రారంభించగానే.. అవతలి నుంచి అరవడం మొదలుపెట్టారు. స్పీకర్‌కు పదేపదే విజ్ఞప్తి చేశాను. దయచేసి కంట్రోల్ చేయండి.. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి.. మీకు అధికారం ఉందని, వారిని కూర్చోబెట్టాలని రిక్వెస్ట్ చేశాను. అదే సందర్భంలో ఈ సభ కాంగ్రెస్ పార్టీది కాదని నేను చెప్పాను. ఈ సభ అందరిదీ.. ఈ సభలో అందరికీ సమాన హక్కులు ఉన్నయ్.. ఈ సభ పెద్దగా మీకు ఆ బాధ్యత ఉంది.. మమ్మల్ని అనడానికి లేదు. అందరినీ కంట్రోల్ చేయాల్సిన అవసరం, సభ నడపాల్సిన అవసరం ఉందని గుర్తు చేశాను’ అన్నారు.
కానీ, ఇక్కడ అనని మాటలను పట్టుకొని.. ఆ తర్వాత వరుసబెట్టి నిస్సిగ్గుగా.. బీఆర్ఎస్ శాసనసభ్యులకు మీడియా పాయింట్లో మాట్లాడే అవకాశం రాకుండా ఒకరి తర్వాత ఒకరిని 26మందిని మాట్లాడించారు. శాసనసభ స్పీకర్ స్థానం గురించి కదా మాట్లాడుతున్నది. దానికి కులం, మతం ఉంటదా? దళితుల గురించి మాట్లాడాల్సి వస్తే.. ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో.. ఎక్కడ.. ఏ మున్సిపాలిటీలో ఇచ్చారో తెలియదు కానీ.. నా సూర్యాపేటలో జనరల్ మహిళా స్థానంలో ఒక్క ఎస్సీ మహిళకు అవకాశం ఇచ్చి.. ఐదేళ్లు విజయవంతంగా పాలన పూర్తి చేయించాం. అద్భుతమైన పరిపాలనతో ఆమె మంచి పేరు తెచ్చుకుంది. ఇదే కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసి.. ద్రోహపూరితంగా ఆమెను దించే ప్రయత్నం చేస్తే.. అడ్డుకొని కొట్లాడి.. మళ్లీ పదవిలో కొనసాగేటట్టు ప్రయత్నం చేశాం. అది నా కమిట్మెంట్ సూర్యాపేట ప్రజలకు తెలుసు. కానీ, ప్రభుత్వం తాను చేసే తప్పులను కప్పిపుచ్చుకునేందుకు.. కమీషన్ల దందా నుంచి ప్రజల పక్కదారి పట్టించేందుకు.. శాసనసభ మొదటిరోజే ఏదో ఒకటి చేయాలని.. ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులు అరవడం మొదలుపెట్టారు’ అని గుర్తు చేశారు.
‘నిన్న సీఎం క్లాస్పీకి వెళ్లాడని.. ఇవాళ లేకపోతే బాగుండదని.. ముఖ్యమంత్రి మెప్పుపొందేందుకు ఈ రకంగా కాంగ్రెస్.. ప్రతిపక్షం గొంతు వినపడకుండా కుట్ర చేసింది. దాంట్లో భాగంగానే నన్ను సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్ష్ ప్రజల గొంతులను ఆపలేవు. ఏమీ లేనినాడు.. కేసీఆర్ మమ్మల్ని తయారు చేసి.. మొత్తం ప్రపంచానికి తెలంగాణ గొంతును వినిపించిన.. రాష్ట్రాన్ని తీసుకువచ్చిన కేసీఆర్ నాయకత్వంలో రాటుదేలిన సైనికులం. ఇది పెద్ద సమస్య కాదు. పదవులనే గడ్డిపోచ్చల్లా వదిలేసి.. కేంద్రమంత్రి పదవి, ఇక్కడి ఎమ్మెల్యే, మంత్రి పదవుల దాకా రాజీనామా చేసిన బీఆర్ఎస్కు ఇవేవీ కొత్తవి కాదు. గతంలో చూడని అనుభవాలు కాదు. ఇవాళ ఈ ప్రభుత్వం డొల్లతనం, కుట్ర భయపడింది. సభ మొదలైన నాలుగు నిమిషాలకే.. కాంగ్రెస్ ప్రభుత్వం బట్టలు విప్పే కార్యక్రమం మొదలైంది.. ఈ ఉపన్యాసం పూర్తయితే.. అయింత మమ్మల్ని బరిబాతల ప్రజల ముందటనే భయంతోనే ఈ ప్రభుత్వం చేసిన కుట్ర సస్పెన్షన్. తప్పకుండా ప్రజల్లో ఎండగడుతాం. న్యాయస్థానాల్లోనూ ఎదుర్కొంటాం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీగా నిరంతరం వినిపిస్తూనే ఉంటాం’ జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు.