బడంగ్పేట్, ఫిబ్రవరి 24: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మహేశ్వరం మండలం నాగారం గ్రామ పరిధిలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు నెరవేర్చడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
రైతులకు రైతు భరోసా సక్రమంగా ఎప్పుడు ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు 420 హామీలలో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ మండలంలో 13 ఎంపీటీలను గెలిపించుకోవాలన్నారు. మండల అధ్యక్ష పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. జిల్లాలోని జెడ్పీటీసీలను గెలిపించుకొని జెడ్పీ చైర్ పర్సన్ పదవి దక్కించుకోవాలన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరన్నారు.
గ్రామాలలో ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన గాడి తప్పిందన్నారు. ఇండ్లు కూల్చివేయిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పాండు యాదవ్, వెంకటేశ్వర్‌రెడ్డి, కర్రొల చంద్రయ్య, అన్మగల చంద్రయ్య, లింగం నవీన్, ప్రభాకర్, బీఆర్ఎస్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.