హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్ ఆయనకే తెలియదు, ఇక ఫ్యూచర్ సిటీ ఎక్కడిదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దందా నడుస్తున్నదని ఆరోపించారు. ఓ పథకం ప్రకారం ఎల్ అండ్ టీ సంస్థపై ఒత్తిడి తెచ్చి హైదరాబాద్ మెట్రో నుంచి తప్పించారని, తద్వారా రూ.వెయ్యి కోట్లు లాభం పొందాడన్నారు. రాష్ట్ర ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం మోపారని విమర్శించారు. హైదరాబాద్ మెట్రో ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ మెట్రోకు ఉన్న రూ.35వేల కోట్ల ఆస్తులను ఆదాని, మెగాకి కట్టబెట్టడానికి ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫ్యూచర్ లేని సిటీ ఫ్యూచర్ సిటీ అన్నారు. జనమే లేని చోట, ఇండ్లు లేని చోట, జనావాసాలు లేని చోట ఫోర్త్ సిటీకి రోడ్లు వేస్తా, మెట్రో తీసుకోపోతా అని రేవంత్ రెడ్డి అంటున్నాడని మండిపడ్డారు. గురుశిష్యులు ఇద్దరు కలిసి ఒకే రైలులో అమరావతికి వెళ్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. కాంగ్రెస్ వచ్చాక ఒక్క తట్టెడు మట్టి కూడా వేయలేదు. ఇల్లు లేని దగ్గర రోడ్లు వేయడం రేవంత్ మూర్ఖత్వమే అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి అని ప్రజలు నమ్మడం లేదని, ఈ ప్రభుత్వంపై విశ్వాసం లేదన్నారు. బీసీ ప్రజలను మోసం చేసి తెలంగాణ ప్రజలపై రుద్దాలని చూస్తున్నారని చెప్పారు. ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి అంటేనే ప్రకలకు ఒక జోక్ అయిందని ఎద్దేవా చేశారు.
పెరుగుతున్న జనాభాకు ఇంకో 50 ఏండ్లకు సరిపోయే పద్ధతుల్లో మెట్రోను మూడు ఫేజ్‌ల్లో విస్తరించాలని కేసీఆర్ ఆనాడు చెప్పారు. దీనికి క్యాబినెట్ సమావేశంలో చర్చ చేసి, మంత్రుల అభిప్రాయాలను తీసుకొని అవసరమున్న చోట మెట్రో విస్తరణ చేయడానికి ప్రణాళికలు చేశారు. మూడు ఫేజ్‌ల్లో హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల ప్రజలకు అనువుగా ఉండేవిధంగా, శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కలుపుతూ మెట్రోను కట్టాలని కేసీఆర్ ప్రణాళికలు చేశారన్నారు.
ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడితే, మంత్రులు, ఎమ్మెల్యేలు మరో మాట మాట్లాడుతున్నారు. వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? సర్కస్ నడుపుతున్నారా?. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మైక్ ముందు ట్రిపుల్ ఆర్ రోడ్డు వెంటనే పూర్తి చేస్తామని అంటాడు.. బాధితులు వెళ్తే అది ఇప్పట్లో అవ్వదు వెళ్లిపోండి అని అంటాడు. సినిమాలకు ముందు రోజు టికెట్ రేట్లు పెంచితే, తనకు తెలియకుండా పెంచారు అని అంటాడని విమర్శించారు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావు లిక్కర్ బ్రాండ్లను తనకు తెలియకుండా మార్చారని, నోటిఫికేషన్లు ఇచ్చారని అంటాడని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరుద్యోగులకు ఇస్తామన్న ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం మోసం చేసింది అంటాడు.. మళ్ళీ పొద్దుగాల రేవంత్ రెడ్డికి, నాకు మధ్య గ్యాప్ ఏమి లేదని అంటాడని ఎద్దేవా చేశారు.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఈ ప్రభుత్వంలో కమిషన్ల దందా నడుస్తుంది.. పొల్యూషన్ చేస్తున్న కంపెనీలను తగలబెడుతా అని అంటాడు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నా నియోజకవర్గంలో వరదలు వచ్చాయి, మా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రపంచ బ్యాంకుకు లేఖ రాశాడు. ప్రపంచ బ్యాంకు కేంద్రం అనుమతి లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికే అప్పు ఇవ్వదు, ఆయన తన నియోజకవర్గానికి అప్పు ఇవ్వాలని లేఖ రాశాడు. చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అసలు రిజర్వేషన్లే సరిగ్గా చేయలేదని చీఫ్ సెక్రటరీకి లేఖ రాశాడు. అసలు ఈ ప్రభుత్వంలో ఏం నడుస్తుందని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.