హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణకు చేసింది ఏమీ లేదని, చెప్పుకోవడానికి ఏమీ లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) అన్నారు. లేని గొప్పలు చెప్పుకోవడం ఆయనకు అలవాటేనని విమర్శించారు. నానాటికీ ఆయన తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి అసత్యాలతో సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడని చెప్పారు. కేసీఆర్ హయాంలో 6,47,479 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామన్నారు. మరి మా హయంలో రేషన్ కార్డులు పంపిణీ జరగలేదని అంటున్న రేవంత్ చెంప దెబ్బకు సిద్ధమా? అని ప్రశ్నించారు.
నల్లగొండ జిల్లాలో రైతాంగాన్ని ఆగమాగం చేశారన్నారు. రేవంత్ రెడ్డి రెండు పంటలను ఎండబెట్టి నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడారన్నారు. ధాన్యం ఉత్పత్తిలో నల్లగొండ జిల్లాను దేశంలోనే నంబర్ వన్‌గా బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చిదిద్దింది. ధాన్యం ఉత్పత్తిలో 3 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 40 లక్షల మెట్రిక్ టన్నుల పెంచింది బిఆర్ఎస్ ప్రభుత్వమే. నల్గొండలో యాదాద్రి పవర్ ప్లాంట్, 3 మెడికల్ కాలేజీ లు, యాద్రాది టెంపుల్ అభివృద్ధి కేసీఆర్ హయాంలోనే జరిగాయి కదా. మరి సీఎంగా రేవంత్ హయాంలో ఒక్క ప్రాజెక్ట్ అయినా ప్రారంభించారా?. నల్లగొండ రైతులనే అడుగుదాం.. వారి చెంప దెబ్బలకు నేను సిద్ధంగా ఉన్నా. మరి సీఎం రేవంత్, మంత్రులు అందుకు సిద్ధమేనా? అని జగదీష్‌రెడ్డి సవాల్ విసిరారు. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ నుంచి బీఆర్ఎస్ తరఫున తానొక్కడినే ఎమ్మెల్యేగా గెలిచానని, ఇప్పుడు ఎన్నికలు పెడితే 12కు పన్నెండు సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్కరిని కూడా గెలవనియ్యనని చాలెంజ్ చేశారు.
నీళ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసిందని విమర్శించారు. సోమవారం నాటి తుంగతుర్తి మీటింగ్‌లో రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని చెప్పారు. పాలన చేతగాని రేవంత్ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయనే రైతు భరోసా వేశారని చెప్పారు. 27 వేల కోట్లు తెలంగాణ రైతాంగానికి రేవంత్ రెడ్డి బాకీ ఉన్నారని తెలిపారు. మీది ప్లాట్ల దందా.. కమిషన్ల దందా అని చెప్పారు. మాది నీళ్లు.. రైతు సంక్షేమ పంథా అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎక్కడైనా చర్చకు సిద్ధమేనన్నారు. గోదావరి ఎండిపోయి రైతులు కన్నీళ్లు పెడుతున్నారని, పంప్ హౌస్‌ల వద్ద మోటార్లు ఆన్‌చేస్తే నీళ్లు వస్తాయన్నారు. మేమిచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగాలు తప్ప.. సొంతంగా ఒక్కటైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. మోదీ చంద్రబాబు సపోర్టు ఉందని ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు స్క్రిప్టును రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నాడని ధ్వజమెత్తారు. తెలంగాణ రైతులను మోసం చేసి ఏపీకి నీళ్లిచ్చే కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. మీలాగా గురుదక్షిణగా కృష్ణా, గోదావరి జలాలను అప్పగించలేదన్నారు. గురుదక్షిణ కింద నీవు చేస్తున్న దుర్మార్గం ప్రజలు గ్రహిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు పేరొస్తుందని కాళేశ్వరాన్ని ఎండబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయాంలో ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను అక్రమంగా అరెస్టు చేయించలేదన్నారు. ఏడాదిన్నరగా మీ ప్రభుత్వం బాగోతం ప్రజలు గ్రహిస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా పిచ్చిమాటలు మాట్లాడటం మానుకొని నిబద్ధతతో మాట్లాడలని రేవంత్ రెడ్డి హితవు పలికారు.