హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాష్ట్రానికి 50 పైసలు తేలేదు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.5లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఇందులో 2లక్షల కోట్ల అప్పు ఉందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఎక్కే ఫ్లైట్ దిగే ఫ్లైట్‌తో అర్ధశతకం పూర్తి అయిందన్నారు. దాదాపు 50వేల కోట్లు ఢిల్లీకి మూటలు సమర్పించారని మోదీ గతంలో అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎం అయిందని మోదీ విమర్శలు చేశారన్నారు. కేసీఆర్ పదేళ్ల కాలంలో
పదిసార్లు ఢిల్లీకి వెళ్లారు. రేవంత్ రెడ్డి 20నెలల కాలంలో నెలకు రెండు సార్లకు పైగా ఢిల్లీకి వెళ్లారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి, మంత్రులు గప్పాలు కొట్టడంలో ఆరితేరారు. రైతుల మోటర్లు కాలిపోతున్నాయి. ఎక్కడా ఎరువుల కొరత లేదని మంత్రులు నిస్సిగ్గుగా చెప్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంటే గొప్పగా ఉంటుందని జనం నమ్మి ఓట్లు వేశారు . ఎమర్జెన్సీ రోజుల్లో ఉన్న పరిస్థితులు మళ్లీ వచ్చాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇష్టంవచ్చినట్లు సోషల్ మీడియాను వాడుకుని మా ప్రభుత్వంపై బురదచల్లారు. ఇప్పుడు మీడియాను చూస్తే భయపడుతున్నారు. గతంలో ఇష్టమైన ప్రాంతం అశోక్ నగర్ అని అన్నారు. ఇప్పుడు అశోక్ నగర్ అంటే రేవంత్ రెడ్డికి భయంపుడుతుందన్నారు. ప్రియాంక గాంధీ వచ్చి స్కూటీ ఇస్తుందని చెప్పారు. రేవంత్ రెడ్డి మూర్ఖత్వానికి పరాకాష్ట. నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం గురించి జాగ్రత్తగా రాయాలని కోరుతున్నా. తెలంగాణ నుంచి ఎందుకు సడెన్ గా పైసలు మాయమయ్యాయి?
తెలంగాణలో ఉండాల్సిన రూ.50వేల కోట్లు ఢిల్లీకి వెళ్లాయి. తెలంగాణ ఆర్థిక, పారిశ్రామిక రంగం, రియల్ ఎస్టేట్ రంగం కోమాల్లోకి వెళ్లాయన్నారు. తెలంగాణ ప్రజల జేబులు కొట్టి ఢిల్లీకి కప్పం కడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడులో జ్ఞానిని మించి బ్రహ్మ జ్ఞానిలా మాట్లాడుతున్నారు. బనకచర్లపై మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. బనకచర్ల అంటే ఏంది అనేది ఇప్పటికీ మహేష్ కుమార్ గౌడ్ కు తెలియదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మీడియాలో వస్తున్న వార్తలన్నీ అబద్ధం. తప్పుడు వార్తలు రాసేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
పోలవరంలో జరిగిన దుర్మార్గాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేమే. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇచ్చింది మేమే. తెలంగాణను పంటల విస్తీర్ణంలో మొదటి స్థానంలో నిలిపింది మేమే అని స్పష్టం చేశారు. కేసీఆర్ మల్లెపువ్వులాగా తిరిగి వస్తారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఎంపీ లింగయ్య యాదవ్, ఎన్.భాస్కర్ రావు, రవీంద్ర కుమార్, బీఆర్ఎస్ నేతలు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.