సూర్యాపేట, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నియోజకవర్గవ్యాప్తంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. రేవంత్‌కు పాలన చేతకాకనే కాలం వెల్లబుచ్చుతున్నాడని ఆరోపించారు. రెండేండ్లు కావస్తున్నా రేవంత్ బూతు పురాణాలు ఆపడం లేదని విమర్శించారు. ఇంకా ఆయన ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మరిపించేందుకు కొత్త నాటకాలు ఆడుతున్నారని అన్నారు.
ఒక్క రంగంలో కూడా అడుగు ముందుకేసిన దాఖలాలు లేవని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు సైతం కుంటుపడేలా చేస్తున్నాడని విమర్శించారు. కొత్త ఇండ్లు కట్టిస్తామని చెప్పి ఉన్న ఇండ్లు కూలగొట్టే పని చేపట్టారని మండిపడ్డారు. కొత్త ప్రాజెక్టుల మాట దేవుడెరుగు ఉన్న ప్రాజెక్టులను బంద్ పెట్టి పొలాలను ఎండబెడుతున్నాడని దుయ్యబట్టారు. కాంగ్రెస్.. బీజేపీ సహకారంతోనే కేసీఆర్‌పై కుట్రలు చేస్తున్నదని, ఈ రెండు పార్టీలకు కేసీఆరే ప్రధాన శత్రువని అన్నారు. దీంతో రేపటి తెలంగాణ కేసీఆర్‌దే అని వాళ్లకు అర్థమైందని చెప్పారు. మళ్లీ ప్రజా సంక్షేమ పార్టీ బీఆర్ఎస్ రాబోతుందన్న విషయం వారికి తెలిసిపోయిందని, అందుకే కక్కలేక మింగలేక అవస్థ పడుతున్నారని ఎద్దేవా చేశారు.
రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ రాజకీయ చరిత్ర అందరికి తెలుసని, స్ట్రీట్ ఫెలోస్ స్టేట్ లీడర్లు కావడం వల్లే ప్రజలకు కష్టాలు తప్పడం లేదని అన్నారు. వాస్తవానికి బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీలుగా ఒకరినొకరు విమర్శించుకోవాలి, కానీ వారిద్దరు కలిసి కేసీఆర్ మీద ఏడుస్తున్నప్పుడే చిల్లర చేరికలతో బీజేపీ స్థాయి ఏందో తెలుస్తున్నదని, ఎవరో మాజీ ఎమ్మెల్యేను పట్టుకొని బీజేపీ ఏదో ఊహించుకుంటే అయిపోతుందా? అని ప్రశ్నించారు. 2024 పార్లమెంట్ ఎన్నికలతోనే మోదీ ఓటమి మొదలైందన్న విషయం అర్థం చేసుకోవాలని అన్నారు. రేవంత్, బండి సంజయ్ ప్రమాణాలు ప్రజలందరికి తెలుసని, వారికి దేవుళ్లపై విశ్వాసం లేదని చెప్పారు. నిజంగా ట్యాపింగ్ చేయించింది కేసీఆర్ అని దేవుడి వద్ద ప్రమాణం చేస్తావా? అని బండి సంజయ్‌ని ప్రశ్నించారు.