హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly elections) కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేశాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) అన్నారు. కేసీఆర్.. బీఆర్ఎస్ పేరిట దేశ వ్యాప్తంగా తిరిగితే బలోపేతం అవుతారని మోదీ భయపడి కాంగ్రెస్‌కు సహకరించారని ఆరోపించారు. రాహుల్‌ను ఎదుర్కోవడం కన్నా కేసీఆర్‌ను ఎదుర్కోవడం కష్టమని మోదీ అనుకున్నారని, అందుకే బీజేపీ ఓట్లు పద్ధతిగా కాంగ్రెస్‌కు మళ్లించారని విమర్శించారు.
సోమవారం నల్లగొండ పార్లమెంటు నియోజక వర్గ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బండి సంజయ్‌ను బీజేపీ అధిష్ఠానం తప్పించింది. కాగా, ఆయన్ను తప్పించడంలో కేసీఆర్ పాత్ర ఉందని దుష్ప్రచారం చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్ కుంగిపోతే కేంద్రం నుంచి అధికారులు హుటాహుటిన వచ్చి తప్పుడు రిపోర్టు ఇచ్చారని, ఇది కాంగ్రెస్‌కు మేలు చేయడానికే ఇలా చేశారని మండిపడ్డారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పార్లమెంటు ఎన్నికల్లో కూడా కలిసే బీఆర్ఎస్ను ఎదుర్కోబోతాయన్నారు.
ఈ కుట్రను బీఆర్ఎస్ కార్యకర్తలు ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన పార్టీ మనదని, ఆ ఉద్యమంలో ఇప్పుడు పది శాతం శక్తితో పోరాడినా కాంగ్రెస్‌ను నిలువరించవచ్చని అన్నారు. ప్రభుత్వాన్ని నడపడం కాంగ్రెస్ వల్ల కాదని, ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనల రుజువు చేస్తున్నాయని మాజీ మంత్రి స్పష్టం చేశారు.