నీలగిరి, ఏప్రిల్ 13 : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు మంత్రుల చేతకాని తనం కారణంగా ఎస్ఎల్బీసీని శాశ్వతంగా మూసివేసే కుట్ర జరుగుతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కోసం ఆదివారం నల్లగొండలోని లక్ష్మీ గార్డెన్స్‌లో నల్లగొండ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలకులకు ఎస్ఎల్బీసీ పూర్తి చేసే దమ్ములేదని విమర్శించారు. ప్రమాదం జరిగి 50 రోజులైనా అందులో చిక్కుకున్న వారిని ఇంతవరకు బయటకు తేలేకపోయారని దుయ్యబట్టారు. జిల్లాలో నీళ్లు లేక పంటలు ఎండిపోయిన రైతులకు ధైర్యం చెప్పే సోయి మంత్రులు, నాయకులకు లేదని మండిపడ్డారు.
కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని దద్దమ్మలా మారిందని విమర్శించారు. మంత్రి కోమటిరెడ్డివి మాటలు తప్ప చేతలు లేవని ఆరోపించారు. కొనుగోళ్లు కేంద్రాలు ఏర్పాటు చేసినా కొన్ని చోట్ల ఇంకా ప్రారంభం కాలేదని అన్నారు. ఇంతటి దుర్మార్గపు ప్రభుత్వానికి రైతుల బాధలు కన్పించడం లేదని మండిపడ్డారు. జిల్లాకు చెందిన ఆ ఇద్దరు మంత్రులు చేతకాని తనం, కమీషన్ల కక్కుర్తి వల్లే రైతులపై మిల్లర్లు, దళారులు దాడులకు దిగుతున్నారని తెలిపారు. 16 నెలల కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని చెప్పారు. రేవంత్‌రెడ్డి సర్కార్‌ను ఇంకా ఎన్ని రోజులు భరించాలి అంటూ ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నన్ని రోజులు ధైర్యంగా ఉన్నారని, రైతుబంధుతో పెట్టుబడి, పండిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకున్నామని తెలిపారు. ప్రజలు, రైతాంగాన్ని ఏకం చేసి పోరాటాలపై మళ్లించాలని సూచించారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ప్రజలు పండుగలా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, చకిలం అనిల్‌కుమార్, కటికం సత్తయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.