హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : వరద జలాల పేరిట గోదావరిని కొల్లగొట్టేందుకే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల కమిటీని తెరపైకి తెచ్చారని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ఎత్తుగడలో భాగంగానే, ఆయన అనుకున్న పద్ధతుల్లోనే ఇటీవల ఢిల్లీలో ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించారని విమర్శించారు. అపెక్స్ కౌన్సిల్‌కు పిలువకుండా బలహీనమైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని లోబరుచుకొని గోదావరి జలాలను తరలించుకొపోయేందుకు ఎత్తులు వేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక పథకం ప్రకారమే చంద్రబాబు తనకున్న పరపతితో ప్రధాని మోదీపై, కేంద్రమంత్రిపై ఒత్తిడి తెచ్చి సమావేశం ఏర్పాటు చేయించారని పేర్కొన్నారు. ఈ సమావేశానికి ఎలాంటి ప్రాధాన్యం లేదని, వాస్తవానికి మన ముఖ్యమంత్రి తిరస్కరించాల్సిందని చెప్పారు.
సోమవారం ఒక న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. నీటి వాటాలు తేల్చకుండా అధికారుల కమిటీతో ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. నీటి వాటాలు తేలాలంటే కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు. పాత ట్రిబ్యునల్ ఇచ్చిన నివేదిక ప్రకారం గోదావరిలో నికర జలాలేవీ లేవని స్పష్టంచేశారు. అందుకే ట్రిబ్యునల్ రాకముందే బనకచర్లతోపాటు వరద జలాలపై హక్కులు సాధించుకొనేందుకు యత్నిస్తున్నారని, ఇందులో భాగంగానే అధికారిక కమిటీ పేరిట దొంగ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు కేంద్రానికి తన అవసరం ఉన్నదని గ్రహించే అటు కేంద్రాన్ని, ఇటు మన రాష్ట్ర ముఖ్యమంత్రిని బ్లాక్మెయిల్ చేస్తున్నారని దుయ్యబట్టారు. అధికారుల కమిటీ చెల్లుబాటు కాదని, ఎలాంటి అధికారం లేదని తేల్చిచెప్పారు.
అధికారుల కమిటీ చెల్లుబాటు కానప్పటికీ, ప్రధాని మోదీ రంగంలోకి దిగి కమిటీ రిపోర్టు వచ్చిందని, దానికి ఒప్పుకోవాల్సిందేనని మన ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి, ఒప్పించే ప్రమాదం ఉన్నదని జగదీశ్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. సీబీఐ, ఈడీలను జేబు సంస్థలుగా వాడుతున్న మోదీకి చిన్నచిన్న అధికారులపై ఒత్తిడి తేవడం పెద్దపనికాదని పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ, ఎన్డబ్ల్యూడీఎల్ ప్రకారం నికర జలాలు ఇవ్వడానికి మనకు హక్కులేనట్టే, అడిగే హక్కు కూడా చంద్రబాబుకు లేదని స్పష్టంచేశారు. దీని నుంచి బయటపడేసేందుకు చంద్రబాబు కొత్త కమిటీని సృష్టించారని, ఈ వ్యవహారంలో ప్రధాని మోదీ, చంద్రబాబు కుట్రదారులని, రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి పాత్రధారులని విమర్శించారు. కమిటీ ప్రతిపాదనలకు ఒప్పుకుంటే తెలంగాణ జలహక్కులకు గొడ్డలిపెట్టులా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.