హైదరాబాద్ : రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పాలన చేతకాక, ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల నిరసనను అడ్డుకుంటున్నారని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy )అన్నారు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలో బీఆర్ఎస్ (BRS) పార్టీ తలపెట్టిన రైతు మహాధర్నాకు(Rythu Mahadharna) పోలీసులు అనుమతి నిరాకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన పని చేయటం పార్టీల హక్కు అని తెలిపారు. తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నదని ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఆరోపించారు.
కేటీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా రేవంత్ రెడ్డికి ఎందుకు వణుకు పుడుతుందని ప్రశ్నించారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కండ్లముందే పంటలు ఎండిపోతుంటే రైతులు పంట చేలకు నిప్పు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను మోసం చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుంది. రేపు నల్గొండలో సభ నిర్వహిస్తామంటే ఈ రోజు పోలీసులు అనుమతి నిరాకరించారు. చేసిన వాగ్దానాలు అమలు చేయాలని ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతుంటే అనుమతులు నిరాకరించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.
కుట్రలను తిప్పికొడుతాం..
పోలీసుల తీరును తప్పు పడుతూ కోర్టుకు వెళ్లైనా ధర్నా చేపడుతామని స్పష్టం చేశారు. గతంలో కూడా కుంటి సాకులు చెప్పి అనుమతులు నిరాకరిస్తే కోర్టుకు వెళ్లి మరీ శాంతియుతంగా ధర్నా చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కేటీఆర్ ఎక్కడికి వెళ్లినా శాంతియుతంగానే ప్రజలు కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, ఎంత అడ్డుకున్నా రేపటి దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కాగా, కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలో బీఆర్ఎస్ (BRS) పార్టీ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈనెల 21న పట్టణ కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద జరుగనున్న ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దీనికి సంబంధించి జిల్లా నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో గ్రామ సభలు, సంక్రాంతి రద్దీ కారణంగా బందోబస్తు ఇవ్వలేమంటూ జిల్లా పోలీసులు ధర్నాకు అనుమతి నిరాకరించారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి కోసం హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.