మేడ్చల్/శామీర్‌పేట, జనవరి 30: బీఆర్ఎస్ను బొందపెట్టడం కాదు.. త్వరలో రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొందపెట్టుడు ఖాయమని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ధ్వజమెత్తారు. 56 ఏండ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏమి ఉద్ధరించిందని ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తే అప్పులు కాకపోతే లంకెబిందెలు ఉంటయా? అని విరుచుకుపడ్డారు.
మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం ఆలియాబాద్ చౌరస్తాలోని సీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన ఉమ్మడి శామీర్‌పేట కృతజ్ఞత సభలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని స్పష్టంచేశారు. అభివృద్ధి ప్రదాత కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఇష్టారీతిన మాట్లాడటంపై మండిపడ్డారు.
మాయమాటలు, మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక కేసీఆర్, కేటీఆర్‌ను తిట్టడానికే సీఎం, మంత్రులు పరిమితం అవుతున్నారని మండిపడ్డారు. కేంద్రం సహకరించకున్నా తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం కష్టపడ్డదని చెప్పారు. హైదరాబాద్‌ను అమెరికా తరహాలో తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్, కేటీఆర్‌కే దక్కుతుందని స్పష్టంచేశారు.
రేవంత్‌కు దమ్ముంటే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని సవాల్ విసిరారు. ప్రజలను మోసం చేసే కాంగ్రెస్ నాయకులకు ‘మల్లన్న’ సినిమా చూపిస్తానని చురకలంటించారు. కార్యకర్తలు అధైర్య పడొద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ పుణ్యాన వారికి పదవులు : జగదీశ్‌రెడ్డి
కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించకుంటే కాంగ్రెస్ వారికి పీసీసీ పదవులు, బీజేపీ నేతలకు రాష్ట్ర పదవులు వచ్చేవా? అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్ర శ్నించారు. ఇప్పుడు మంత్రి పదవుల్లో ఉన్న వారు ఉమ్మడి ఏపీలో కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలో ఉన్న వారేనని.. అప్పట్లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆంధ్రకు రూ.6 వేల కోట్లు తీసుకెళ్తే తెలంగాణకు రూ.వంద కోట్ల తీసుకురాలేని అసమర్థులుగా మిగిలారని ఎద్దేవాచేశారు. పదవులు కోసం వారు తెలంగాణకు ద్రోహం చేస్తే.. కేసీఆర్ పదవులను త్యజించి, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని కొనియాడారు.
24 గంటల కరెంట్ ఇవ్వడానికి ఎప్పుడూ బీ ఆర్ఎస్ ప్రభుత్వం వెనుకాడలేదని స్పష్టంచేశారు. ఇప్పుడు మంత్రులు స్వయంగా కరెంట్ కోతలు ఉంటాయని ప్రకటిస్తున్నారని చెప్పారు. 420 హామీలతో రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేసారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్‌రెడ్డి, నేతలు భద్రారెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, తూంకుంట మున్సిపాలిటీ చై ర్మన్ రాజేశ్వర్‌రావు, ఎంపీపీలు ఎల్లుబాయి, హారిక, జడ్పీటీసీ సభ్యులు అనిత తదితరులు పాల్గొన్నారు.