సూర్యాపేట: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు. అవినీతి విషయంలోనే అద్భుత ప్రగతి సాధిస్తున్నదని ధ్వజమెత్తారు. అన్ని శాఖల్లో కమీషన్లే వారి ఎజెండా అని మండిపడ్డారు. ఏ మంత్రి ఎంత సంపాదించాలి, సీఎం సీటుకు ఎట్లా పోటీపడాలన్న సోయి తప్ప మరొకటి లేదన్నారు. అభివృద్ధిని పక్కనపెట్టి దోచుకునే విషయంలో పోటీపడుతున్నారని చెప్పారు. సూర్యాటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్కు మరోసారి నోటీసులు, సిరిసిల్ల క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ మూకల దాడిని ఖండించారు.
‘ప్రశ్నిస్తున్న వాళ్లకు నోటీసులు ఇప్పించి బయపెట్టాలని చూస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ చార్జిషీట్లో రేవంత్ పేరును ఈడీ పేర్కొన్నప్పటికీ.. మోదీని కలవడానికి వెల్లాడంటేనే ఆయన బుద్ధి అర్ధమవుతుంది. దీనినిబట్టి రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రేస్ దోస్తీ ఎట్లుందో తెలుస్తుంది. రేవంత్ చిల్లర చేష్టలతో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తున్నాడు. అందాల పోటీలతో ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీసిండు. కేటీఆర్కు (KTR) నోటీసులిస్తే బయపడతామనుకుంటున్నారా?. ఆ నాడు కేటీఆర్ స్వయంగా 8 గంటలు కూర్చుని చెప్పిన విషయం మీకు గుర్తుకులేదా.
ప్రపంచ వ్యాప్తంగా కేటీఆర్ క్రేజ్ పెరుగుతుందని రేవంత్ ఏడుస్తున్నది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఇతర దేశాల ఆహ్వానం మేరకు వెళ్తున్నాడని తట్టుకోలేక పోతున్నారు. వాటికీ హాజరుకాకుండా ఆపాలనే అక్కసుతోనే నోటీసులు ఇచ్చారు. నోటీసులతో చిల్లర డ్రామాలు చేస్తూ మరింత నవ్వుల పాలవుతున్నారు. చిల్లర రాజకీయాలతో బీఆర్ఎస్ కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయలేరు. 18 నెలలైనా ఇంకా బీఆర్ఎస్ మీద ఏడుపు తగ్గలేదు. కేసీఆర్ కాళేశ్వరం ఎందుకు కట్టిండో కాంగ్రెస్కు అవగాహన లేదు. మన నీళ్లను చంద్రబాబు తీసుకెళ్తుంటే సోయిలేదు. చిల్లర చేష్టలు మానుకొని ఇకనైనా అభివృద్ధిపై దృష్టి సారిస్తే మంచిది.
సిరిసిల్ల ఘటన చిల్లర చేష్ట..
ప్రోటోకాల్ చూడాల్సిన బాధ్యత ఆఫీసర్ల పని. కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ చిల్లర మూకలకు ఏంపని. కేటీఆర్ క్రేజ్ ఖండాతరాలకు వ్యాపించింది. ఆ ఏడుపుతోనే తమ నాయకుడిపై చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారు. కాంగ్రేస్ పనికిమాలిన చర్యలతో మరింత అభాసుపాలవుతున్నది. రేవంత్ బాసులనే తరిమికొట్టి తెలంగాణ తెచ్చినోళ్ళం. ఆయన చిల్లర చేష్టలకు భయపడతామా. తస్మాత్ జాగ్రత్త.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి’ అని కాంగ్రెస్ నాయకులను జగదీశ్ రెడ్డి హెచ్చరించారు.