హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక మానసిక రోగి. విచక్షణారహితంగా మాట్లాడటం ఆయన నైజం. ఎలాపడితే అలా అబద్ధాలు మాట్లాడడం ఆయనకు నిత్యకృత్యం. ఆదివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో కూడా బూతు పంచాంగమే అందుకున్నాడు’ అని మాజీ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఇంతలా ఇష్టారీతిన మాట్లాడే సీఎం ఇప్పటివరకు ఎవరూ లేరని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల మాదిరిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం కోసం ఆరుసార్లు సీఎం రేవంత్‌రెడ్డి గల్లీ, గల్లీ తిరిగారని, అది సరిపోదన్నట్టు మీట్ ది ప్రెస్‌లో కూడా పాల్గొన్నారని విమర్శించారు. ప్రెస్‌క్లబ్ అంటే గౌరవం లేకే స్టార్ హోటల్లో నిర్వహించారని ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేండ్లలో కేవలం 20 వేల ఉద్యోగాలే ఇచ్చి, 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టుగా బిల్డిప్ ఇస్తున్నాడని దుయ్యబట్టారు. వారన్నట్టే ఉద్యోగావకాశాలు కల్పిస్తే, జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిరుద్యోగులు ఎందుకు ప్రచారం చేశారని నిలదీశారు. ‘కేసీఆర్ కట్టిన భవనాలతో ఉద్యోగాలొచ్చాయా’ అన్న రేవంత్‌వి పిచ్చి ప్రేలాపనలు అని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ రోడ్‌షోలలో పెద్ద ఎత్తున వస్తున్న జనాదరణను చూసి, రేవంత్‌రెడ్డికి మతిపోయిందని దుయ్యబట్టారు.
‘నచ్చితే ఆంధ్రా సీఎం చంద్రబాబన్న నచ్చాలి. లేదా దివంగత సీఎం వైఎస్సార్ అన్నా నచ్చాలి. కానీ, ఆ ఇద్దరూ నచ్చడమేంది? ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారం విచిత్రంగా, అంతా అయోమయంగా ఉన్నది’ అని జగదీశ్‌రెడ్డి దుయ్యబట్టారు. దివంగత కాంగ్రెస్ నేత పీజేఆర్ గురించి మాట్లాడే హక్కు రేవంత్‌రెడ్డికి లేనేలేదని విమర్శించారు.
2004-2014 కాలంలో జరిగిన కాంగ్రెస్ పాలన స్వర్ణయుగం అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఆ కాలంలో రైతుల ఆత్మహత్యలు, ఆకలిచావులు జరగలేదా? సీఎం సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్‌లో ఆనాడు ఆకలిచావులు కనబడలేదా? అని నిలదీశారు. ఆ కాలంలో, ‘తండ్రి చనిపోతే.. స్నానానికి నీళ్లున్నప్పటికీ, కరెంటు లేని పరిస్థితి ఉన్నది అని అన్నది తమరే కదా?’ అని గుర్తుచేశారు. ఈ రెండేండ్ల కాలంలో 24 గంటల కరెంటు ఇచ్చామని, దాంతో హైదరాబాద్‌కు పెట్టుబడులు తరలివచ్చాయని చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. కాంగ్రెస్ పరిపాలనలో వలసల బాటకు స్వస్తి పలికించి, వ్యవసాయ బాటగా మార్చింది తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 1,000కిపైగా గురుకులాలు పెట్టింది కేసీఆర్ అని జగదీశ్‌రెడ్డి గుర్తుచేశారు. అలాంటి కేసీఆర్ బడులు మూసివేశారంటూ రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క బడినైనా తెరిచారా? కనీసం ఒక్క కొత్త ప్రాజెక్టునైనా తెచ్చారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. రేవంత్‌రెడ్డీ.. తమరు రిబ్బన్ కట్ చేసే ముందు కేసీఆర్, కేటీఆర్‌ను గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. కేసీఆర్, కేటీఆర్ వల్లే హైదరాబాద్‌కు బ్రాండ్ ఇమేజ్ వచ్చిందని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెఫరెండంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
‘చదువు రాకుంటే తెలిసిన వాళ్లను అడుగాలి. అంతేకానీ రూ.60 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో కేసీఆర్‌కు రాష్ట్రం అప్పగించారు అని ఎలా అంటావు?’ అని రేవంత్‌రెడ్డిని జగదీశ్‌రెడ్డి నిలదీశారు. అసలు వాస్తవం ఏమిటంటే.. కేసీఆర్ సీఎం అయ్యే నాటికి మిగులు రూ.300 కోట్లు అని, దిగిపోయే నాటికి రూ.5,000 కోట్లు మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పజెప్పామని వివరించారు.
ఉమ్మడి ఏపీలో కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య మాత్రమే పండితే, కేసీఆర్ హయాంలో, 2019లోనే 2 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని జగదీశ్‌రెడ్డి వివరించారు. ‘తెలంగాణను తెచ్చిన, అభివృద్ధి సంక్షేమంలో దేశంలోనే రాష్ర్టాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లిన కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తావా? అని రేవంత్‌రెడ్డిపై జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. గోపీనాథ్ కుటుంబ సభ్యుల గురించి దిగజారుడు మాటలు ఎందుకు? అని ప్రశ్నించారు. ‘కవిత, మాగంటి గోపీనాథ్ తల్లి గురించి మాట్లాడుతున్నావు.. మీ సొంత అన్న కూతురి పెండ్లికి మీ కుటుంబసభ్యులు ఎందుకు వెళ్లలేదు? అంటూ మండిపడ్డారు.
గత రెండేండ్లలో సీఎం రేవంత్‌రెడ్డి రూ.30 వేల కోట్లను వెనుకేసుకున్నారని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. నిర్మాణ రంగం కుదేలవడంతో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తంచేశారు. పాలనా వైఫల్యాలతోనే ఎన్నో రాష్ర్టాల్లో కాంగ్రెస్ దాదాపు 40 ఏండ్లు అధికారానికి దూరంగా ఉన్నదని గుర్తుచేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, బూడిద భిక్షమయ్యగౌడ్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఫైళ్ల శేఖర్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ రామచంద్రనాయక్, పల్లె రవికుమార్, బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగబాలు పాల్గొన్నారు.