Jagadish Reddy | మంత్రి కోమటిరెడ్డి బూతులకు త్వరలోనే సమాధానం చెబుతామని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళన, కేటీఆర్‌పై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు జగదీశ్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సజ్జెక్ట్పై కాకుండా మంత్రులు బూతులు మాట్లాడుతూ మీడియాకు వినోదం పంచుతున్నారని విమర్శించారు. స్పృహ లేకుండా మాట్లాడుతున్న కోమటిరెడ్డి మూసీ కాలుష్యానికి కారణం ఏవరో చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్ ద్రోహ ఫలితమే మూసీ కాలుష్య కాసారంలా తయారైందని.. మూసీ చుట్టూ కెమికల్ ఫ్యాక్టరీలు ఎవరి హయాంలో వచ్చాయో చర్చకు సిద్ధమన్నారు. డ్రామాలు చేసి తప్పించుకునేందుకు పిల్లచేష్టలు చేస్తున్నారన్నారు.
1956 మంచినీటి మూసీని 2014 నాటికి కాలుష్యకాసారంగా మారింది ఎవరివల్లో తెలుద్దామన్నారు. రాజాకార్లను వెంట వేసుకుని తిరిగిన కాంగ్రెస్‌కి రావి నారాయణరెడ్డి పేరెత్తే హక్కు లేదన్నారు. దొరలకు, రాజకార్లకు నిలయం కాంగ్రెస్ పార్టీయేనని.. నల్లగొండ బిడ్డలు బలైంది కాంగ్రెస్ తూటాలకేనని మరిచిపోయారా? అన్నారు. కోమటిరెడ్డి భాషచూసి ప్రజలు నవ్వుకుంటున్నారని.. చెప్పుకునేందుకు ఏమీలేక బూతు పురాణం ఎత్తుకుంటున్నారని విమర్శించారు. చిల్లర వేషాలు, చిల్లర భాష మానుకోవాలని హితవు పలికారు. కేటీఆర్ చెప్పినట్లు రూ.16.5వేల కోట్లకు మూసీని ప్రక్షాళన చేయవచ్చని.. చేతకాకపోతే తమకు అవకాశం ఇచ్చి చూడాలని డిమాండ్ చేశారు.