హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజల్లోకి వస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. నల్లగొండ రైతు ధర్నాకు వస్తానంటే మీరెందుకు భయపడుతున్నారని నిలదీశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా కమిటీ చేపట్టిన రైతు ధర్నాను అడ్డుకోవడం కాంగ్రెస్ సర్కార్ చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికుట్రలు చేసినా అన్నదాతల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని స్పష్టంచేశారు. నల్లగొండలో రైతు ధర్నా చేపడితే అక్కడికి వచ్చిన రైతులు మంత్రి కోమటిరెడ్డిని బట్టలూడదీసి కొడతారనే భయంతోనే అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాజ్‌భవన్ ఎదుట సీఎం, మంత్రులు నిరసన చేపడితే లేని ఇబ్బంది, నల్లగొండ క్లాక్‌టవర్ వద్ద చేపడితే ఎలా కలుగుతుందని ప్రశ్నించారు. అక్కడ కలగని ట్రాఫిక్ ఇబ్బందులు, నల్లగొండలో కలుగుతాయా అని నిలదీశారు. రైతులు తిరగబడుతున్నారనే ధర్నాలను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నల్లగొండ అభివృద్ధిపై చర్చించే దమ్మున్నదా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి జగదీశ్‌రెడ్డి సవాల్ విసిరారు. పదేండ్లలో ఉమ్మడి నల్లగొండ అభివృద్ధికి కేసీఆర్ సహకారంతో తాను వేసిన పునాదిరాళ్లు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ప్రగతిని లెక్కించడానికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జీవితకాలం సరిపోదని పేర్కొన్నారు. 40 ఏండ్లు మీకు ఉమ్మడి జిల్లాను ప్రజలు అప్పగిస్తే ఆస్తులు, ఆకారాలను పెంచుకొని ప్రజలను పీల్చుకుతిన్నారని మండిపడ్డారు.
మిల్లర్లతో కుమ్మక్కై రైతుల పంటలను కాంగ్రెస్ దళారుల చేతిలో పెట్టి రూ.కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. ‘నల్లగొండ జిల్లాలో ఎక్కడ దొరికితే అక్కడ మిమ్మల్ని బట్టలూడదీసి కొట్టేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. పోలీసులు, సెక్యూరిటీ లేకుండా జిల్లాలో ఎక్కడికైనా వెళ్లి తిరిగి రాగలవా? బీఆర్స్ పదేండ్ల అభివృద్ధిపై మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోండి’ అంటూ మంత్రి కోమటిరెడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందించిన ఘనత కేసీఆర్‌దని జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. కరవు కాటకాలతో అల్లడాతున్న ఉమ్మడి జిల్లా బీడు భూములను పదేండ్ల పాలనలో సస్యశ్యామలం చేశామని తెలిపారు. రైతులు పండించిన వడ్లను కల్లాల వద్దే కొనుగోలు చేసి, వెంటనే నగదును వారి ఖాతాల్లో వేశామని తెలిపారు.
తడిసిన, మొలకెత్తిన వడ్లను మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతుల కన్నీరు తుడిచామని గుర్తుచేశారురు. సర్ణయుగంలా సాగిన పదేండ్ల కేసీఆర్ పాలనపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి లేదని స్పష్టంచేశారు. కోమటిరెడ్డి స్పృహ లేకుండా మాట్లాడుతున్నారని, కండ్లు తెరిచి చూస్తే గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కనిపిస్తుందని హితవు పలికారు. సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని అసమర్థ నేతలకు గత బీఆర్ఎస్ పాలనపై మాట్లాడే అర్హత లేదని హెచ్చరించారు.