Anirudh Reddy | హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ)/మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో ‘పేసా ఫేక్.. తమాషా దేఖ్’ సంస్కృతి నడుస్తున్నదని జడ్చర్ల ఎమ్మె ల్యే అనిరుధ్‌రెడ్డి సొంత ప్రభుత్వంపైనే తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వంలో పైసలు ఉ న్నోడికే పనులు అవుతున్నాయని, పేదలు పదిసార్లు తిరగడమే తప్ప పనులు కావడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశా రు. క్షేత్రస్థాయిలో అధికారుల నుంచి పై స్థాయి వరకు అన్నిచోట్లా పైసలు లేనిదే, చేతులు తడపనిదే పనికావడం కష్టతరమైందని మండిపడ్డారు. అడుగడుగునా పైసలు పెట్టాల్సిందేనని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వంలో పేదలను పట్టించుకునేవారే లేరని విమర్శించారు.
ఇప్పపువ్వు సారా అంశాన్ని ఇటీవల తెర మీదికి తీసుకొచ్చిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి.. రాష్ట్రంలో పది లక్షల ఇప్ప చెట్లు నా టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్‌కు లేఖ రాస్తున్నానని, ఈ లేఖపై 52 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారని వెల్లడించారు. తన ఉద్దేశం ఇప్పపువ్వు సారా తయారీ కాదని, ఇప్పపువ్వు సాగును ప్రోత్సహించడం ద్వారా గిరిజన, ఆదివాసీల ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమేనని స్పష్టంచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్ప పువ్వుతో అనేక పదార్థాలను తయారు చేస్తున్న విషయాన్ని తాను అధ్యయనం చేశానని చెప్పారు.
సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువగా డ్రగ్స్ సంస్కృతి ఉన్నదనే ఆరోపణలు ఉన్నాయని, సినీ నటులు ప్రతి 90 రోజులకు ఒకసారీ డ్రగ్ టెస్ట్‌లు చేయించుకొని అభిమానులకు వెల్లడించాలని అనిరుధ్‌రెడ్డి డిమాండ్ చేశారు. సిని మా నటులను అభిమానులు స్ఫూర్తిగా తీసుకుంటారని, వాళ్లను ఆదర్శంగా తీసుకొని నడుస్తారని పేర్కొన్నారు. తమ సినిమా విడుదల ముందు హీరోలు డ్రగ్ టెస్టులు చేయించుకోవాలని, నెగటివ్ వస్తేనే వారి సినిమాను థియేటర్లలో విడుదల చేయాలన్నారు.
సినీ హీరోలు డ్రగ్ టెస్ట్‌లు చేయించుకోవాలం టూ అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు హీరో మంచు విష్ణు.. సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సినిమా విడుదలకు ముందు తాము గ్రడ్స్ టెస్ట్‌లు చేయించుకుంటామని, ఎన్నికల ముందు పోటీలో నిలబడే ప్రజాప్రతినిధులు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలని ప్రశ్నించారు. సినిమా రంగాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని పేర్కొన్నారు.