మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జడ్చర్ల, అక్టోబర్ 13 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో టీడీపీలో ఉన్న సమయంలో కలిసి తిరిగిన సహచర నేత, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ను తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకుంటున్నారన్న సమాచారంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పరోక్షంగా ఆయన సీఎంను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకున్నది. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ విషయమై అనిరుధ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘సంచులు మోసే వాళ్లు మా పార్టీకి అక్కర్లేదు. ఫ్యాక్షనిస్టులకు మా పార్టీలో స్థానం లేదు. సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడిని చంపిన వ్యక్తిని మా పార్టీలోకి తీసుకోం. రేపు ఎమ్మెల్యే టికెట్ కోసం నన్ను కూడా చంపుతాడు. జెడ్ క్యాటగిరీ భద్రత అడగలేను కదా? మా టీపీసీసీ చీఫ్‌ను, సీఎంని కలిసి జెడ్ క్యాటగిరీ అడగాలా? ఇలాంటి వాళ్ల కోసం? సీఎం రేవంత్‌కు, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ఓ క్లారిటీ ఉన్నది. వస్తా అని గేట్ దగ్గరికి వెళ్లిన ఆయనకు అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ఇప్పుడు అందరం ప్రశాంతంగా ఉన్నాం. నాతోపాటు మహబూబ్‌నగర్, నారాయణపేట ఎమ్మెల్యేలు కూడా క్లారిటీ ఇచ్చారు. మీడియాలో పబ్లిసిటీ చేసుకొని వచ్చే వాళ్లకు కాంగ్రెస్‌లో స్థానం లేదు’ అని జడ్చర్ల ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు.
మోసం చేసిన వాళ్లను తిరిగి పార్టీలోకి తీసుకోబోమని ఎన్నికల ముందు చెప్పడం జరిగిందని గుర్తుచేశారు. ఇప్పటివరకు ఫ్యాక్షన్ రాజకీయాలు లేవని ప్రజలు మాట్లాడుకుంటున్నారని, తిరిగి ఆయన పార్టీలోకి వస్తామంటే ఐదుగురు ఎమ్మెల్యేలం ఒప్పుకొనే పరిస్థితి లేదని స్పష్టంచేశారు. ఆయన పరోక్షంగా సీఎం రేవంత్‌కు కూడా చురకలంటించారు. సీఎంకు సన్నిహితుడిగా మెలిగిన శేఖర్‌కు గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో అలిగి బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేవంత్‌తో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎర్ర శేఖర్‌ను తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకురావాలని సీఎం వర్గీయులు భావిస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలో జడ్చర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ సొంత జిల్లాలో కొరకరాని కొయ్యగా మారారు. అనిరుధ్‌రెడ్డికి చెక్ పెట్టేందుకే ఎర్ర శేఖర్‌ను పార్టీలోకి తీసుకుంటున్నారన్న ప్రచారమూ జరుగుతున్నది. ఏకంగా డీసీసీ అధ్యక్ష పదవితోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా జెడ్పీ చైర్మన్ పదవి కూడా ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్టు ఎర్ర శేఖర్ వర్గీయులు అంటున్నారు. గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సీతాదయాకర్‌రెడ్డికి రేవంత్‌రెడ్డి ఏకంగా కార్పొరేషన్ చైర్పర్సన్ పదవి ఇవ్వగా, ఇక మిగిలిన.. ఎర్ర శేఖర్‌ను కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటున్నట్టు తెలిసింది. ఆయనకు డీసీసీతోపాటు జెడ్పీ చైర్మన్ ఆఫర్ కూడా ఇచ్చినట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి డి మాండ్ చేశారు. మహబూబ్‌నగర్ నుంచి 12మంది ఎమ్మెల్యేలం ఉన్నామని, ముఖ్యమంత్రి కూడా ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పారు. వెనుకబడిన జిల్లా అభివృద్ధికి మరిన్ని నిధులు అవసరమని సూచించారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు ఎన్ని నిధు లు ఇచ్చారు? మహబూబ్‌నగర్‌కు ఎన్ని ని ధులు ఇచ్చారో తేల్చాలని కోరారు. ఈ అం శాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతామని అన్నారు. నిధుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు.