హైదారాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): సీఎల్పీ భేటీలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి హల్చల్ చేశారు. రహస్యంగా సమావేశమైన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో అనిరుధ్‌రెడ్డి కూడా ఒకరు. సీఎల్పీ సమావేశానికి ఆయన కొన్ని పత్రాలు పట్టుకొనిరావడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ డాక్యుమెంట్లను ఆయన సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇన్చార్జి దీపాదాస్ మున్షీకి అందిస్తూ.. రాష్ట్రంలో నంబర్-2గా పిలిపించుకుంటున్న ఒక మంత్రి మీద ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని వెలిమల గ్రామం హామ్లెట్ తాండ కొండకల్ గిరిజనులకు చెందిన సీలింగ్ భూములను ఒక మంత్రి కబ్జా పెట్టినట్టు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఆ ఆధారాలనే అనిరుధ్‌రెడ్డి తన వెంట తెచ్చినట్టు సమాచారం. అలాగే అదే జిల్లా అమీన్పూర్ మండల కేంద్రంలో జరిగిన మరికొని కబ్జాల మీద కూడా ఆయన ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భూముల అన్యాక్రాంతంపై విచారణ చేయాలని కోరారు.
పార్టీ ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్‌పై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షి సీరియస్ అయినట్టు తెలిసింది. సమస్య ఉంటే నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాలని, కానీ ఎవరికి వారు రహస్య సమావేశాలు జరిపితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్టు తెలిసింది. బహిరంగ వేదికలపై మాట్లాడి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించినట్టు తెలిసింది. బీసీ కులగణన సర్వే నివేదిక మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజు నోటీసులు ఇచ్చినట్టు దీపాదాస్‌మున్షి తెలిపారు. షోకాజ్ నోటీసు అందుకున్న మల్లన్న సీఎల్పీ సమావేశానికి హాజరు కాలేదు.