Anirudh Reddy | హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): హైడ్రా పనితీరుపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. హైడ్రాతో రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నదని, ఒకవైపు హైడ్రా పేరుతో నోటీసులు ఇస్తారని.. మరోవైపు వాటిపై చర్యలుండవని ఆయన మండిపడ్డారు. శాసనసభ లాబీ లో సోమవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘హైడ్రా పేరుతో లావాదేవీలు జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
మ్యాన్‌హట్టన్ భూ వివాదంపై ఫిర్యాదు చేయడానికి హైడ్రా కార్యాలయానికి వెళ్లాను. నా ఫిర్యాదు స్వీకరించినట్టు రశీదు ఇవ్వాలని హైడ్రా సిబ్బందిని అడిగా. కానీ, వారు రశీదు ఇవ్వలేమని నాతో చెప్పారు. ఇదెక్కడి చోద్యం. రశీదు ఇవ్వకపోతే ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నారో.. లేదో ఎలా తెలుస్తుంది? ఇదే విషయమై స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫోన్ చేస్తే ఆయన లిఫ్టు చేయలేదు. ఎమ్మెల్యేనైన నా పరిస్థితే ఇలా ఉంటే ఇక సాధారణ పౌరుల పరిస్థితి ఏంటి? హైడ్రా తీరుతో సీఎం రేవంత్‌రెడ్డికి కూడా చెడ్డ పేరు వస్తున్నది’ అని అనిరుధ్‌రెడ్డి తెలిపారు.