హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులపై మంత్రులకు వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి గొంతు నొక్కేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున మంత్రులను, ఎమ్మెల్యేలను కలిసి పెండింగ్ బిల్లుల విడుదల గురించి విన్నవించి, అసెంబ్లీలో చర్చ జరిగేలా చూడాలని వినతిపత్రం ఇచ్చేందుకు మంగళవారం అసెంబ్లీ వద్దకు వచ్చిన తమను పోలీసులతో అక్రమంగా అరెస్టు చేయించారని విమర్శించారు. శాంతియుతంగా గాంధేయమార్గంలో అసెంబ్లీ వద్దకు వచ్చిన తమను తీవ్రవాదుల తరహాలో అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారని విమర్శించారు. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు రూ.800 కోట్ల వరకు ఉన్నాయని తెలిపారు. గత ఏడాది మార్చి 31లోపు ఇస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక హామీ ఇచ్చినా నేటికీ నిధులు విడుదల చేయలేదని వాపోయారు. రూ.1.58 లక్షల కోట్లకుపైగా అప్పు చేసిన రేవంత్‌రెడ్డి సర్కారు.. అందులో ఒక్క శాతం కూడా లేని తమ బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. యాదయ్య గౌడ్ వెంట జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, కార్యదర్శి కేశబోయిన మల్లయ్య, నాయకులు బొడ్డు నరసింహయాదవ్, మన్నె పద్మారెడ్డి, ప్రభాకర్, శ్రీమల్ల మేఘరాజు, రాజేందర్ తదితరులు ఉన్నారు.