ఖైరతాబాద్, అక్టోబర్ 13: ‘మాలలకు తీరని ద్రోహం చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పేందుకు జూబ్లీహిల్స్‌లో 300 మందితో మాలలతో నామినేషన్లు వేయిస్తాం. కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాం’ అని మాల సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మందాల భాస్కర్ హెచ్చరించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డిపై, కాంగ్రెస్ సర్కార్‌ఫై నిప్పులు చెరిగారు. వర్గీకరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మాలలను పుట్టిముంచాడని ధ్వజమెత్తారు. ఏకపక్షంగా షమీమ్ అక్తర్ కమిషన్ వేసి సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో వర్గీకరణను అమలు చేశాడని ఆరోపించారు. ఫలితంగా గ్రూప్-1లోని 15, గ్రూప్-2లోని 17, గ్రూప్-3లోని 26 కులాలను రిజర్వేషన్లకు దూరంగా చేసి గడిచిన 6 నెలల్లో జరిగిన ఉద్యోగ నియామకాల్లో 58 కులాలకు అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనే రాజ్యాంగానికి వ్యతిరేకంగా సాగుతున్నదని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాల సామాజిక వర్గానికి 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చి 22 రోస్టర్ ఇవ్వడం వల్ల తాము ఎంతో నష్టపోయినట్టు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి చర్యలను ఖండిస్తూ త్వరలోనే జూబ్లీహిల్స్‌లో జరుగబోయే ఉప ఎన్నికల్లో మాల సంఘాల జేఏసీ తరఫున 300 మందితో నామినేషన్లు వేయిస్తామని వెల్లడించారు. గతంలో కాంగ్రెస్‌కు 75 శాతం ఓటు బ్యాంకుగా ఉన్న మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్లు లేకుండా చేశారని, విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాల్లో అవకాశాలు దక్కకుండా చేశారని, అలాంటి పార్టీకి ఇక నుంచి రాజకీయ అవకాశమే లేకుండా చేస్తామని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఏడు డివిజన్ల పరిధిలో ఓటు హక్కు కలిగిన మాలలెవరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని 30 లక్షల మంది మాలలు కాంగ్రెస్ పాలకులకు బుద్ధి చెప్పాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ అంతమే మాలల పంతం కావాలని పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇకనైనా కండ్లు తెరువాలని, మాలలకు అండగా నిలబడాలని మందాల భాస్కర్ హితవు పలికారు. లేనిపక్షంలో ఆయనను తమ సమాజం నుంచి బహిష్కరిస్తామని స్పష్టంచేశారు. సమావేశంలో తెలంగాణ మాల సంఘాల జేఏసీ గౌరవ అధ్యక్షుడు చెరుకు రాంచందర్, కన్వీనర్ నల్లాల కనకరాజు, చీఫ్ కోఆర్డినేటర్ తాళ్లపల్లి రవి, వర్కింగ్ చైర్మన్లు మంత్రి నరసింహ, భీమ్‌సేన, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బేర బాలకిషన్, వైస్ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, మాదాసు రాహుల్, పీవీ స్వామి, సైదులు, అర్జున్, భానుతేజ తదితరులు పాల్గొన్నారు.