నల్లగొండ, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణప్రతినిధి) : తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే.. కాంగ్రెస్ నేతలు కళ్లుండి చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు. అధికారమే పరమావధిగా కాంగ్రెస్ నేతల వ్యవహారశైలి ఉన్నదని, వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం వెలగబెట్టారని ప్రశ్నించారు. అధికారంపై యావతో అడ్డగోలుగా మాట్లాడుతూ వ్యక్తిగత దూషణలు, అపనిందలకు పాల్పడుతున్నారని విమర్శించారు. దోపిడీకి మారుపేరైన కాంగ్రెస్ నేతలు ఎప్పుడు అధికారంలోకి వద్దామా? ఎప్పుడీ రాష్ర్టాన్ని దోచుకుందామా? అన్న ధోరణితో ఉన్నారని ఆరోపించారు.
శనివారం ఆయన నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 2018 నాటికి రాష్ట్రంలో 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, ప్రస్తుతం మరో 90 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నేతలు డ్రామాలకు తెరలేపారని, వారి డ్రామాలను ఎవరూ నమ్మరని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందని తెలిపారు. రెండు మెడికల్ కళాశాలలు, 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం, ఐటీ హబ్, సాగర్ ఆయకట్టులో కొత్త లిఫ్ట్‌ల నిర్మాణం వంటి ఎన్నో పనులు కండ్ల ముందు కనిపిస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఆ పార్టీ నేతలు కమీషన్లు దండుకొని వదిలేసిన శ్రీశైలం సొరంగం పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం జరిపిస్తున్నదని తెలిపారు.
కలిసి మాట్లాడుకోలేనోళ్లు..
ఒకే వేదికపై కలిసి కూర్చోలేనోళ్లు.. కలిసి మాట్లాడుకోలేనోళ్లు.. రాష్ర్టాన్ని ఏం పాలించగలరో ప్రజలు ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్ నాయకుల చేతికి అధికారమిస్తే రాష్ర్టాన్ని కుక్కలు చించిన విస్తరిలా మారుస్తారని తెలిపారు. నల్లగొండలో నిర్వహించిన నిరుద్యోగ నిరసన సభ.. కాంగ్రెస్ నిరుద్యోగ సభగా సాగిందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ సభ పేరుతో కాంగ్రెస్ నాయకులు తమ మధ్య ఐక్యతను చాటుకునేందుకు ప్రయత్నించారని అన్నారు. మూతులు ముద్దులు పెట్టుకుంటే.. కాళ్లు తన్నుకున్న చందంగా సభా వేదికపై నేతలు వ్యవహరించారని ఎద్దేవా చేశారు. నల్లగొండ నిరుద్యోగ నిరసన సభలో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డిపైనా, తనపైనా, ఎమ్మెల్యేలపైనా కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలు అర్థరహితమని అన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 2004 ఎన్నికల్లో తనను ఓడించాడని గొప్పలకు పోయాడని పేర్కొన్నారు. 2018లో తన శిష్యుడు, సోదరుడైన కంచర్ల భూపాల్‌రెడ్డి చేతిలో ఓడిపోయి తనపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. తమకు ఐదెకరాల భూమి కూడా లేదంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. ఐదు ఎకరాలు, సొంతిండ్లు లేవని చెప్పుకొన్న నేతలకు హైదరాబాద్‌లో విల్లాలు, హైటెక్ సిటీలో భూములు ఎకడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఎన్నికల్లో వందల కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.