Revanth Reddy | హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): అస్తవ్యస్త విధానాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీసిన సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి బీద అరుపులు, బేల వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ‘మనం నవాబులం కాదు.. బికారులం’ అని వ్యాఖ్యానించారు. శిల్పకళా వేదికలో మంగళవారం రైతుభరోసా తొలిదశ నిధులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో విడుదల చేశారు. తొలి విడతలో 41.37 లక్షల మందికి రూ.2,482.02 కోట్లు విడుదల చేశారు. ప్రతి రైతుకూ రెండెకరాల వరకు రైతుభరోసా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎక్కడికి పోయినా ఇజ్జత్ లేకుండా అయిపోయిందని అన్నారు. ‘ఢిల్లీకి పోతే ఇజ్జత్లేదు, గల్లీకి పోతే ఇజ్జత్లేదు, పక్క రాష్ర్టానికి పోతే ఓయమ్మో వీడు తెలంగాణోడు.. వీడితో మాట్లాడితే ఏం అడుగుతడో అన్నట్టు తప్పించుకుంటున్నరు’ అని చెప్పారు. సాధారణంగా తన ప్రసంగాల్లో ఎదురుదాడికి దిగే సీఎం రేవంత్‌రెడ్డి.. రైతుభరోసా సభలో మాత్రం సెంటిమెంట్‌ను రగిల్చేలా, సానుభూతి పొందేలా మాట్లాడారనే చర్చ జరుగుతున్నది.
ఇంతకుముందు ఏ సభలో అయినా 2034 వరకు తానే సీఎంగా ఉంటానని ప్రకటించిన రేవంత్‌రెడ్డి రైతుభరోసా సభలో మాత్రం తనకు పదవి శాశ్వతం కాదని అన్నారు. ‘తాను అబద్ధాలు చెప్పనని, కుల్లం కుల్లా.. ఉన్నది ఉన్నట్టు చెప్తా, చేసిందే చెప్తా, చెప్పిందే చేస్తా అని అన్నారు. తాను ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటున్నానని, తనను కలువడానికి వస్తున్న వారిని కలవకుండా ఉండలేదని చెప్పారు. సర్పంచ్‌లు తమ బకాయిల కోసం సీఎం ఇంటిని ముట్టడిస్తామనే హెచ్చరికలపై రేవంత్ స్పందించారు. ‘సర్పంచ్‌లు నా ఇంటిని ముట్టడిస్తా అంటున్నారు. సంతోషం రండి వస్తే చాయ్ పోస్తా.. టిఫిన్ పెడుతా.. నేనెప్పుడైనా ఎవర్నైనా నా ఇంటికి రానివ్వలేదా’ అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ప్రభుత్వంపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనే విషయాన్ని గమనించిన రేవంత్‌రెడ్డి వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. ‘ఈ సర్కార్ మీది, ఈ సర్కారును రైతులే కంచె వేసి కాపాడుకోవాలి’ అని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు రైతుభరోసా కింద రూ.27వేల కోట్లు పంపిణీ చేశామని, ఈ సీజన్‌తో రూ.36వేల కోట్లకు చేరుతుందని తెలిపారు. ఇప్పటివరకు ఎగవేసిన రూ.29వేల కోట్ల గురించి చెప్పకపోవడం గమనార్హం. గడిచిన 30 నెలల్లో కాంగ్రెస్ సర్కార్ తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నదని తెలిపారు. తెలంగాణలో బీజేపీ వచ్చేదిలేదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ తరఫున కేంద్ర మంత్రులుగా బండి సంజయ్‌కి, కిషన్‌రెడ్డికి మాత్రమే ఉద్యోగాలు లభించాయని, రాష్ట్ర యువతకు దక్కిందేమీ లేదని విమర్శించారు.
మొన్నటి యాసంగిలో రైతుభరోసా ఎగవేతపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. యాసంగిలో రైతులందరికీ రైతుభరోసా ఇవ్వలేదని అంగీకరించారు. రూ.2వేల కోట్లకు పైగా రైతులకు ఇవ్వలేదని చెప్పారు. కేవలం ఉద్యోగుల సంక్షేమం కోసమే చేసినట్టు తెలిపారు. రైతులకు ఇవ్వాల్సిన రైతుభరోసా నిధులను ఎగవేసి.. ఆ నిధులను ఉద్యోగులకు మళ్లించామని చెప్పారు. ఇక తాము రైతులకు అన్ని రకాల పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పలేదని అన్నారు. చాలారకాల రుణాలుంటాయని, తాము కేవలం స్వల్పకాలిక రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని చెప్పామని, బ్యాంకులు ఇచ్చిన వివరాల ప్రకారం అందరికీ రుణమాఫీ చేశామని తెలిపారు. ఇక రైతుభరోసా అంటే ఇది పంట భరోసానని, భూమి భరోసా కాదని చెప్పారు. పంట వేసిన రైతులకే రైతుభరోసా ఇస్తామని స్పష్టంచేశారు.
వానకాలం రైతుభరోసా పంపిణీలో భాగంగా దశల వారిగా 73.32 లక్షల మంది రైతులకు రూ.9వేల కోట్లు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే తొలి విడతలో మంగళవారం 41.37 లక్షల మంది రైతులకు రూ.2482.02 కోట్లు విడుదల చేసింది. అయితే ఈ సందర్భంగా మిగిలిన రైతులకు, మిగిలిన మొత్తాన్ని ఎప్పుడు జమ చేస్తామనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. ఇంకా 31.95 లక్షల మంది రైతులకు రూ.6,518 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రెండెకరాల వరకు చెల్లిస్తున్నట్టు ప్రకటించింది. మరి మిగిలిన దశలను, మిగిలిన రైతులకు బుధవారం నుంచి పంపిణీ చేస్తారా..? లేక నెల రోజులు వాయిదా పెడుతారా అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు.
ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు.. గల్లీకి పోతే ఇజ్జత్లేదు.. పక్క రాష్ర్టానికి పోతే ఓయమ్మో వీడు తెలంగాణోడు.. వీడితో మాట్లాడితే ఏం అడుగుతడో అన్నట్టు తప్పించుకుంటున్నరు.. నాకు పదవి శాశ్వతం కాదు.. నేను అబద్ధాలు చెప్ప.. కుల్లం కుల్లా.. ఉన్నది ఉన్నట్టు చెప్తా.. సర్పంచ్‌లు బకాయిల కోసం నా ఇంటిని ముట్టడిస్తామంటున్నరు. సంతోషం.. రండి, వస్తే చాయ్ పోస్తా.. టిఫిన్ పెడుతా.. నేనెప్పుడైనా ఎవరినైనా నా ఇంటికి రానివ్వలేదా?
-ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి